పరుగులు పెడుతున్న రూపాయి, పసిడి

19 Sep, 2013 10:02 IST|Sakshi

ముంబయి : రూపాయి పుంజుకోవటంతో  స్టాక్‌ మార్కెట్లకు ఈవాళ ఎక్కడలేని బలం వచ్చింది. అమెరికా సెంట్రల్‌ బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకున్న నిర్ణయం రూపాయిని, షేర్లను, బంగారం ధరను పరుగులు పెట్టిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు స్టిమ్యులస్‌ ప్యాకేజీలు కొనసాగించాలని ఫెడ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమెరికా నుంచి ఇండియా లాంటి ఎమర్జింగ్‌ మార్కెట్లలోకి నిధుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ కారణంగా రూపాయి ఈ ఉదయం 165 పైసల లాభంతో ప్రారంభమైంది.

ప్రస్తుతం 61 రూపాయల 72 పైసల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ ప్రారంభంలో 600 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 500 పాయింట్ల దాకా లాభపడుతూ 20,460కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు లాభపడుతూ 6,060 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఒకే రోజు 60 డాలర్ల దాకా లాభపడింది. ప్రస్తుతం 1360 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. అయితే మన మార్కెట్లో బంగారం ధర ఈ స్థాయిలో పెరగకపోవచ్చు. రూపాయి బలపడటమే ఇందుకు కారణం.
 

మరిన్ని వార్తలు