55 పైసలు క్షీణించిన రూపాయి

17 Jan, 2018 01:11 IST|Sakshi

ముంబై: డాలర్‌తో రూపాయి మరోసారి చిన్నబోయింది. మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 55 పైసలు క్షీణించి 64.04కు చేరింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. దేశ వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల విలువలో వ్యత్యాసం) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో రూపాయి అమ్మకాలు వెల్లువెత్తాయి. 

ఎనిమిది నెలల కాలంలో ఒక రోజు రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఇదే. డిసెంబర్‌ నెలలో ఎగుమతులు 12.36 శాతం పెరిగి 27.03 బిలియన్‌ డాలర్లకు చేరగా, అదే సమయంలో దిగుమతులు గణనీయంగా పెరిగి 41.91 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 14.88 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఉన్న గణాంకాలతో పోలిస్తే 41 శాతం అధికం. 

ఈ ప్రభావం ఫారెక్స్‌ మార్కెట్‌పై పడింది. ఉదయం ప్రారంభం నుంచే రూపాయి ప్రతికూలంగా ట్రేడ్‌ అయింది. అదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉండడం కష్టమన్న అంచనాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలతో సమీప కాలంలో ఆర్‌బీఐ రేట్ల కోతకు అవకాశాల్లేవన్న అంచనాలు అనిశ్చితిని పెంచేశాయి.  

మరిన్ని వార్తలు