రూపాయి @ 71

1 Sep, 2018 00:46 IST|Sakshi

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71ని చేరింది. గురువారం ముగింపుతో చూస్తే ఇది 26 పైసలు(0.37%) పతనం. ఇది రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ ప్రారంభంలోనే గ్యాప్‌డౌన్‌తో 70.95 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత బలహీన ధోరణిలోనే కదలాడింది. కాగా, రూపాయి పతనం  ప్రభుత్వ ఆర్థిక విధానాలు ‘వైఫల్యం’గా కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా... అభివృద్ధి చెందుతున్న పలు దేశాల కరెన్సీలు బలహీన పడుతుండటంతో, రూపాయి బలహీనత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఇంకా అధిక విలువలోనే: ఎస్‌బీఐ
రూపాయి ప్రస్తుత ధోరణి పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అభిప్రాయపడింది. ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే గుప్తా ఒక ప్రకటన చేస్తూ, ‘‘రూపాయి కొంచెం పతనానికే ఎవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదు. ఇంకా రూపాయి అధిక విలువలోనే ఉంది’’ అని అన్నారు. టర్కీ, అర్జెంటీనా, ఇండోనేషియా వంటి వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చిచూసినా, భారత్‌ కరెన్సీ ఇంకా మెరుగ్గానే ఉందని అన్నారు. 2019 మార్చి వరకూ రూపాయి 70–71 శ్రేణిలో ట్రేడవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు