పతన బాటలోనే రూపాయి

17 Dec, 2014 00:39 IST|Sakshi
పతన బాటలోనే రూపాయి

మరో 59 పైసలు ఆవిరి... 63.53 వద్ద క్లోజ్ 
13 నెలల కనిష్ట స్థాయి ఇది..


ముంబై: రూపాయి పతనం మరింత తీవ్రతరమవుతోంది. వరుసగా రెండోరోజూ దేశీ కరెన్సీ భారీగా పడింది. మంగళవారం డాలరుతో రూపాయి మారకం విలువ మరో 59 పైసలు నష్టపోయింది. క్రితం ముగింపు 62.94తో పోలిస్తే 0.94 శాతం దిగజారి 63.53 వద్ద ముగిసింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం.. మరోపక్క ముడిచమురు(క్రూడ్) ధర శరవేగంగా పడిపోతుండటంతో దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయి విలువను ఆవిరయ్యేలా చేస్తోంది.

కాగా, ఈ పతనానికి అడ్డుకట్టవేయడం కోసం ఆర్‌బీఐ డాలర్ల విక్రయం ద్వారా కొంత జోక్యం చేసుకున్నప్పటికీ... ఫలితాలివ్వడం లేదని ఫారెక్స్ మార్కెట్ డీలర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నేడు(బుధవారం) 64 స్థాయి దిగువకు పడిపోయే అవకాశం కూడా ఉందనేది వారి అంచనా. సోమవారం కూడా రూపాయి 65 పైసలు క్షీణించింది. వెరసి 2 రోజుల్లో 124 పైసలు(2%) ఆవిరైంది. కాగా, డాలరుతో రూపాయి విలువ దీర్ఘకాలంపాటు 62 దిగువన గనుక కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులేనని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

‘లోటు’ గుబులు...
విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాలు జోరందుకోవడంతో... మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 538 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఇది కూడా దేశీ కరెన్సీ సెంటిమెంట్‌ను దిగజార్చింది. ఇదిలాఉంటే.. నవంబర్ నెలలో భారత్ వాణిజ్య లోటు ఏడాదిన్నర గరిష్టస్థాయిలో 16.8 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర మంగళవారం మరింత దిగజారి 54 డాలర్లకు(నెమైక్స్ బ్యారల్ రేటు) పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ 60 డాలర్ల దిగువకు చేరింది.

రూబుల్ ఆల్‌టైమ్ కనిష్టానికి...
క్రూడ్ ధరల పతనం.. ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో రష్యా కరెన్సీ కుదేలవుతోంది. కొద్దిరోజులుగా పతనబాటలోనే ఉన్న డాలరుతో రూబుల్ విలువ.. మంగళవారం ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఏకంగా 18 శాతంపైగా కుప్పకూలి.. 80ని తాకింది. 1998లో ఆర్థిక సంక్షోభం తర్వాత రష్యా కరెన్సీ ఇంతలా కుప్పకూలడం ఇదే తొలిసారి. కాగా, కరెన్సీ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం సోమవారం పొద్దుపోయాక అకశ్మాత్తుగా రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేటును 10.5 శాతం నుంచి 17 శాతానికి అమాంతం పెంచేసింది.

గత గురువారం వడ్డీరే టును 5.5% నుంచి తొలుత 10.5 శాతానికి పెంచి ంది. అయితే, ఈ చర్యలకు ఫలితం లేకుండా పోయింది. ఈ ఏడాది  రష్యా కరెన్సీ 50% పైగా ఆవిరికావడం గమనార్హం.  క్రూడ్, ఇతరత్రా ఇంధన వనరులపైనే అత్యధికంగా ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థ.. తాజా పరిణామాలతో వచ్చే ఏడాదిలో మళ్లీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతర్జాతీయంగా డాలరు విలువ బలపడుతుండటంతో... వర్ధమాన దేశాల్లోని ఇతర కరెన్సీలు కూడా తీవ్రంగా క్షీణిస్తున్నాయి.

మరిన్ని వార్తలు