వారం గరిష్టానికి రూపాయి

15 Sep, 2018 02:38 IST|Sakshi

71.84 వద్ద ముగింపు  

ముంబై: డాలర్‌ మారకంలో పడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. బుధవారం ముగింపుతో పోల్చితే  (గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌ సెలవు) 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగిసింది. దేశీయంగా ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం రూపాయి ఒక దశలో 71.53 స్థాయిని కూడా తాకింది. రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్‌ కనిష్టం 72.92 స్థాయిని చూసింది. అటు తర్వాత కొంత కోలుకుని చివరకు 72.69 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్‌లో 51 పైసలు లాభపడి 72.18కి రికవరీ అయ్యింది. శుక్రవారమూ రికవరీ ధోరణినే కొనసాగించి, మరో 34 పైసలు లాభపడింది.  

కారణాలు ఇవీ...
దేశంలో అటు టోకు, ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం (ఆగస్టులో వరుసగా 3.69%, 4.53 శాతం) పరిస్థితి మెరుగ్గా ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (జూలైలో 6.6 శాతం వృద్ధి) మెరుగ్గా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ సైతం కీలక స్థాయి 95 దిగువకు పడిపోవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆయా అంశాలు డాలర్‌ అమ్మకాలకూ దారితీసింది. రూపాయి స్థిరీకరణకు కేంద్రం, ఆర్‌భీఐ నుంచి చొరవ ప్రారంభమయినట్లు సమాచారం. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 94.80 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.80 వద్ద ట్రేడవుతోంది.


రూపాయిపై మరింతగా దృష్టి పెట్టాలి: రతిన్‌ రాయ్‌
రూపాయి మారకం విలువ తీవ్ర స్థాయిలో పతనమైన నేపథ్యంలో దీనిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు రతిన్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు. సాధారణంగా డాలర్‌తో పోలిస్తే వార్షికంగా రూపాయి 4–6 శాతం క్షీణించడం కొంత మేర సమంజసమైన స్థాయిగానే భావించవచ్చని.. కానీ ప్రస్తుత పతనం ఈ పరిమితిని అసాధారణంగా దాటేసిందని ఆయన ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ నిర్వహణ సరిగ్గానే కొనసాగిందన్నారు. రూపాయి ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 13% క్షీణించింది, ప్రధాని  మోదీ ఆర్థిక సమీక్ష నేపథ్యంలో రాయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.   

>
మరిన్ని వార్తలు