రికార్డు కనిష్టానికి రూపాయి

19 Mar, 2020 14:10 IST|Sakshi

కరెన్సీకి కరోనా కాటు

ఫారెక్స్‌ మార్కెట్లో తొలిసారి

75 వద్ద చరిత్రాత్మక కనిష్టం

సాక్షి, ముంబై :  దేశీయ కరెన్సీపై కూడా  కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపుతోంది. డాలరుతో మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్‌ కిందికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో  గురువారం రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్టం. అనంతరం మరింత దిగజారి ఏకంగా 81 పైసలు(1.1 శాతం) 75.08 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక కనిష్టం. 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్‌ కనిష్టాన్ని తాకింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ తాజాగా 100ను సైతం అధిగమించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బుధవారం రూపాయి నామమాత్రంగా 2 పైసలు నీరసించి 74.26 వద్ద నిలవగా.. మంగళవారం సైతం ఇదే ధోరణిలో 74.28 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈ‍క్విటీ  మార్కెట్లు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్ల లాబంతో, నిఫ్టీ 50  పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి.  తద్వారా  సెన్సెక్స్‌ కనిష్టం నుంచి 2000, నిఫ్టీ 600, నిఫ్టీ బ్యాంకు 2100 పాయింట్లు  పుంజుకోవడం విశేషం. 

మరిన్ని వార్తలు