ఆసియా కరెన్సీల లాభాల మద్దతు

19 Jun, 2019 09:27 IST|Sakshi

21 లాభపడి 69.70కి రూపాయి

ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో నష్టపోతూ వచ్చిన రూపాయి మంగళవారం కొంత కోలుకుంది. డాలర్‌ మారకంలో 21 పైసలు లాభపడి 69.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల స్పీడ్‌ తగ్గడం, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ సమావేశం నేపథ్యంలో డాలర్‌ బలహీనత  వంటి అంశాలు తాజాగా రూపాయిపై ప్రభావం చూపాయి. దీనితో దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల పరిస్థితి తీవ్ర ఒడిదుడుకులతో ఉన్నా,  రూపాయిపై ఎటువంటి ప్రతికూలతా కనబడలేదు. ఇక పలు ఆసియా కరెన్సీల లాభాలూ రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతిదారులు కూడా డాలర్ల అమ్మకానికి దిగారు. మంగళవారం 69.82 కనిష్ట–69.70 గరిష్ట స్థాయిలను చూసింది.

ఈ వార్తరాసే 9.30 గంటల సమయంలో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 97.15 వద్ద ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 69.50 వద్ద ట్రేడవుతోంది. అంటే భారత్‌లో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ముగింపుకన్నా మరింతగా 20 పైసలు బలపడిందన్నమాట. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్‌ ధరల  భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి మూడు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. కాగా అటు తర్వాత అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్‌ బలోపేతం, క్రూడ్‌ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ పటిష్టస్థాయి, అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా.

మరిన్ని వార్తలు