టైమ్ వార్నర్‌పై మర్డోక్ కన్ను..

18 Jul, 2014 01:52 IST|Sakshi
టైమ్ వార్నర్‌పై మర్డోక్ కన్ను..

 బోస్టన్: మీడియా దిగ్గజం, ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ అధినేత రూపర్ట్ మర్డోక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించారు. తాజాగా మరో మీడియా దిగ్గజం టైమ్ వార్నర్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 80 బిలియన్ డాలర్ల(సుమారు రూ.4.8 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చారు. అయితే, టైమ్ వార్నర్ దీన్ని తిరస్కరించడంతో మరో కొత్త వ్యూహాన్ని రచించడంలో మర్డోక్ నిమగ్నమయ్యారు.

గతంలో ఆయన టైమ్ వార్నర్ షేరుకి 85 డాలర్ల చొప్పున లెక్కగడతామని ఆఫర్ చేశారు. డీల్ మొత్తంలో 60 శాతం భాగానికి ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ షేర్లను, మిగతా 40 శాతం భాగానికి నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. కానీ, ఇందుకు టైమ్ వార్నర్ ఒప్పుకోకపోవడంతో షేరుకి 95 డాలర్ల మేర మర్డోక్ చెల్లించాల్సి రావొచ్చని.. అలాగే డీల్‌లో నగదు పరిమాణాన్ని కూడా మరింతగా పెంచాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

టైమ్ వార్నర్ ఆదాయ సామర్థ్యాలను బట్టి చూస్తే డీల్ విలువ కనీసం 94 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉండాలంటున్నాయి. అదనంగా మరింత వెచ్చించాల్సి వస్తున్నా.. మర్డోక్ మాత్రం ఈ డీల్‌పై పట్టుదలగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో టైమ్ వార్నర్ షేరు మాత్రం దూసుకెడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 20 శాతం ఎగిసి 86 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.

 తెర వెనుక కథ ఇదీ...
 టైమ్ వార్నర్ గ్రూప్‌ను కొంటున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ మర్డోక్ దృష్టంతా ప్రధానంగా ఆ గ్రూప్‌లోని హెచ్‌బీవోపైనే ఉంది. టీవీ నెట్‌వర్క్‌లకు ప్రస్తుతం మరింత ఆదాయం తెచ్చిపెడుతున్న ఆన్‌లైన్ వీడియో సర్వీసుల విభాగంలో.. ఈ చానల్ హెచ్‌బీవో గో పేరిట సేవలు అందిస్తోంది.  సినిమాలే కాకుండా.. అత్యంత ఆదరణ పొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, గ ర్ల్స్ వంటి  టీవీ షోలు హెచ్‌బీవో చేతిలో ఉండటం కూడా మర్డోక్ దృష్టిని ఆకర్షించింది.

 గతేడాది హెచ్‌బీవో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 1.9 బిలియన్ డాలర్ల మేర స్థూల లాభాన్ని ఆర్జించింది. దీనికి పోటీగా దూసుకొస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 4.4 బిలియన్ డాలర్ల మేర ఉండగా లాభం 277 మిలియన్ డాలర్లే. ప్రస్తుతం ఆన్‌లైన్ వీడియో సర్వీసుల వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్న ఫాక్స్ పెద్ద ఎత్తున కంటెంట్ సమకూర్చుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే లాభసాటి హెచ్‌బీవోను కొనుగోలు చేయాలనుకుంటోంది. దీనికోసం ఒక్క హెచ్‌బీవో విలువను 20 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. అయితే, హెచ్‌బీవో ఒక్కదాన్నే కొనేసే పరిస్థితి లేకపోవడంతో.. దానితో పాటు పనిలో పనిగా టైమ్ వార్నర్ గ్రూప్‌ను మొత్తం కొనేసి అత్యంత భారీ మీడియా దిగ్గజంగా నిలవాలని మర్డోక్ నేతృత్వంలోని ట్వెంటీఫస్డ్ సెంచరీ ఫాక్స్ భావిస్తోంది. ఇందుకోసమే టైమ్ వార్నర్ వాటాదారులు నిరాకరించలేని ఆఫర్ ఇవ్వాలని యోచిస్తోంది.

 
 టైమ్ వార్నర్:  2013 గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాప్ 62.4 బిలియన్ డాలర్లు   హెచ్‌బీవో, సీఎన్‌ఎన్, సినీమ్యాక్స్, కార్టూన్ నెట్‌వర్క్ తదితర చానల్స్ ఉన్నాయి.
 
   ఇంటర్నెట్‌కి సంబంధించి సీఎన్‌ఎన్‌డాట్‌కామ్, కార్టూన్ నెట్‌వర్క్‌డాట్‌కామ్ మొదలైనవి సినిమాలు, టీవీ కార్యక్రమాల నిర్మాణానికి సంబంధించి వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ టీవీ, న్యూలైన్      సినిమా మొదలైనవి టైమ్ వార్నర్ గ్రూప్‌లో కీలకంగా ఉన్నాయి.
 
 ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్: 2013 గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాప్ విలువ 75.5 బిలియన్ డాలర్లు.
 
   ఫాక్స్ న్యూస్, స్టార్ ఇండియా, నేట్‌జియో, బిగ్‌టెన్ నెట్‌వర్క్ తదితర చానెల్స్ ఉన్నాయి.
   ప్రీమియం వీడియో కంటెంట్ అందించే హులు వెబ్‌సైట్‌లో 33 శాతం వాటాలను కలిగిఉంది.
 
   సినిమాలు, టీవీ కార్యక్రమాల నిర్మాణంలో ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్, ఫాక్స్ సెర్చ్‌లైట్ వంటివి ఉన్నాయి.

మరిన్ని వార్తలు