గ్రామీణ ప్రాంతాలకు ‘ఇంటర్నెట్ సైకిల్ బళ్లు’

4 Jul, 2015 00:38 IST|Sakshi
గ్రామీణ ప్రాంతాలకు ‘ఇంటర్నెట్ సైకిల్ బళ్లు’

ముంబై: గ్రామీణ ప్రాంతాల మహిళల్లో ఇంటర్నెట్‌పై అవగాహన పెంచే దిశగా టాటా ట్రస్ట్స్, గూగుల్ ఇండియా నడుం బిగించాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 1,000 ‘ఇంటర్నెట్ సైకిల్ తోపుడు బళ్లను’ మారుమూల గ్రామాలకు పంపనున్నాయి. శుక్రవారం వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా, గూగుల్ ఇండియా ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ పాల్గొన్నారు.

ఐస్‌క్రీములు, ఇతర ఉత్పత్తులు విక్రయించే సంప్రదాయ తోపుడు బళ్ల తరహాలోనే.. ఇంటర్నెట్‌పై అవగాహన పెంచేందుకు సైకిల్ బళ్లను ఉపయోగించనున్నట్లు ఆనందన్ పేర్కొన్నారు. తోపుడు బండిని తీసుకొచ్చే ఆపరేటరు (ఇంటర్నెట్ సాథి).. ఆయా గ్రామా ల్లో మహిళలకు ఇంటర్నెట్ వినియోగంపై శిక్షణనిస్తారని వివరించారు. ముందుగా గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్‌లలో ఇంటర్నెట్ సైకిళ్లు సర్వీసులు మొదలవుతాయని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని టాటా ట్రస్ట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆర్ వెంకటరమణన్ తెలిపారు. సుమారు 4-6 నెలల పాటు ఒకో గ్రామం/క్లస్టర్‌లో వారానికి 2రోజుల పాటు ఈ సైకిల్ కార్ట్ అందుబాటులో ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు