తొలి దేశీ ఎలక్ట్రానిక్‌ చిప్‌!!

28 Dec, 2018 03:18 IST|Sakshi

పృథ్వీ 3ని రూపొందించిన సాంఖ్య ల్యాబ్స్‌

5జీ కనెక్షన్లకు, కాల్‌ డ్రాప్స్‌ నియంత్రణలో ఉపయోగం  

న్యూఢిల్లీ: కాల్‌ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్‌ చిప్‌సెట్‌ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్‌ రూపొందించింది. మొబైల్‌ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్‌ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్‌ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్‌ను మొబైల్‌ నెట్‌వర్క్‌ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్‌ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్‌ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్‌ నాయక్‌ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను శాటిలైట్‌ ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ చిప్‌సెట్స్‌ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్‌ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్‌ ఎలక్ట్రానిక్‌ చిప్‌సెట్స్‌.. దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్‌ ప్లాంటులో తయారవుతున్నాయి.   

మరిన్ని వార్తలు