పెటాకులకు సహారానే కారణం: మిరాచ్

7 Feb, 2015 02:32 IST|Sakshi
పెటాకులకు సహారానే కారణం: మిరాచ్

న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి నిధుల సమీకరణ  విషయంలో జరిగిన డీల్ మసకబారిపోవడానికి ఆ సంస్థే కారణం తప్ప తాము కాదని అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. భారతీయ సంతతికి చెందిన ఈ సంస్థ సీఈఓ సారాంశ్ శర్మ  ఈ మేరకు ఒక ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేశారు.  మరోవైపు నిధుల వేటలో కొత్త దారులను సహారా వెతకడం ప్రారంభించింది. అలాగే తమను ఘోరంగా మోసాచేశారంటూ మిరాచ్ కేపిటల్‌పై చట్టపరమైన చర్యలను సైతం ప్రారంభించే పనిలో ఆ సంస్థ నిమగ్నమైందని గ్రూప్ వర్గాలు తెలిపాయి.

కాగా విదేశాల్లో మూడు  హోటల్స్ (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్- లండన్‌లోని గ్రాస్‌వీనర్)ను  పూర్తిగా కొనుగోలు చేస్తామన్నది తమ తుది ప్రతిపాదన తప్ప, తనఖాల ద్వారా రుణాలివ్వడం ఆఫర్ కాదని,  ఈ విషయం స్పష్టం చేసినందునే డీల్‌ను సహారా తనకుతానుగా అనవసరంగా చెడగొట్టుకుంటోందని వివరించింది. అసలు సహారాకు ఈ ఆస్తుల విక్రయం ఇష్టం లేదని మిరాచ్ తెలిపింది. తమతోపాటు సుప్రీంకోర్టు, సెబీలు విలువైన కాలాన్ని సహారా వృథా చేసిందని మిరాచ్ విమర్శించింది. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫోర్జరీ లేఖను మిరాచ్ తమకు చ్చిందంటూ సహారా ఆరోపించిన అంశంపై మాత్రం మిరాచ్ ఏ వ్యాఖ్యానం చేయలేదు.
 
ఇదీ విషయం...

మొదలిలా...
సహారా గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశాయన్నది ఆరోపణ. ఇన్వెస్టర్లకు నిధుల పునఃచెల్లింపులకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. దీనిపై సహారా వైఫల్యంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్లను దాఖలు చేసింది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం... గత ఏడాది మార్చిలో సహారా చీఫ్ రాయ్‌ని తీహార్ జైలుకు పంపింది. బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
 
రంగంలోకి బ్యాంక్ ఆఫ్ అమెరికా
ఈ డీల్‌లో తమ పాత్ర ఏదీ లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటించడంతో వ్యవహారం మొత్తం సందేహాస్పదమైంది. కోర్టు డాక్యుమెంట్లలో బ్యాంకర్‌గా తన పేరును పేర్కొన్నట్లు తెలుసుకుని తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి  ఒకరు ఇటీవల తెలిపారు.  ఈ నేపథ్యంలో తమను మిరాచ్ మోసం చేసినట్లు సహారా ప్రకటించింది. డాక్యుమెంట్ల ఫోర్జరీలు జరిగినట్లు ఆరోపిస్తూ, ఈ విషయంలో అమెరికా సంస్థ మిరాచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
 
సహారా నిధుల వేట...
సుప్రీం ఆదేశంతో విదేశాల్లోని మూడు హోటళ్లను విక్రయం లేదా తనఖా చేసే పనిలో పడింది. ఈ పరిస్థితుల్లో బ్రూనై సుల్తాన్ నుంచి నిధులు వస్తాయని అనుకున్నా... చివరకు ఆ డీల్ కుదరలేదు. రెండవ డీల్ విషయానికి వచ్చే సరికి మిరాచ్ సంస్థ తాజా ప్యాకేజ్ ఆఫర్ చేసిందని సుప్రీంకోర్టుకు సహారా తెలిపింది. దీనికి బ్యాంకర్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటూ మిరాచ్ ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లు తమకు ఇచ్చిందంటూ సుప్రీంకూ సహారా విన్నవించింది.
 
మిరాచ్ ఏమంటోందంటే...
సహారా ఆస్తులను కొనుగోలు చేయడానికి మేము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. ఫోర్జరీ ఆరోపణలు సత్యదూరం. మూడు హోటళ్లను పూర్తిగా తాము కొనుగోలు చేస్తామన్నది ప్రతిపాదన తప్ప... తనఖా లావాదేవీ ప్రతిపాదన ఎక్కడా రాలేదు. ఈ విషయాన్నే మేము సహారా గ్రూప్‌కు స్పష్టం చేశాం. అయితే దీనికి తొలుత సరేనన్న సహారా, చివరకు తన వైఖరిని మార్చుకుని ఈ కేసులో సుప్రీంకోర్టు, సెబీ, మా కంపెనీ, ఇన్వెస్టర్ల విలువైన సమయాన్ని వృథా చేసింది.
 
సహారాకు ఈడీ నోటీస్
లండన్ హోటల్ సంబంధించి సహారాకు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరైట్ (ఈడీ) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్‌ఈఎంఏ- ఫెమా) కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  లగ్జరీ హోటల్  గ్రాస్‌వీనర్ కొనుగోలు వ్యవహారంలో రూ. 3,600 కోట్ల మేర నిబంధనలు ఉల్లంఘించిందన్నది ఆరోపణ.  రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

భారత్ నుంచి 2010లో నిధుల బదలాయింపుల సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనీ, విదేశాల్లో భారత్ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలను పాటించలేదని, సంస్థ అనుమతులు సైతం తీసుకోలేదని ఈడీ పేర్కొంది. ఈ కేసును ఆర్‌బీఐ ఈడీకి రిఫర్ చేసిందని, తాజాగా దీనిపై షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు