మందగమనానికి బ్రేక్ పడినట్లే!

24 Sep, 2014 00:56 IST|Sakshi
మందగమనానికి బ్రేక్ పడినట్లే!

న్యూఢిల్లీ: దేశీ స్టీల్ రంగంలో మందగమన పరిస్థితులకు ఫుల్‌స్టాప్ పడినట్లేనని ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ పేర్కొన్నారు. తయారీ రంగంతోపాటు, స్మార్ట్ సిటీలు, పోర్ట్‌లు, విద్యుత్ ప్లాంట్‌లు, పారిశ్రామిక వాడలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టడంతో స్టీల్‌కు డిమాండ్ పుంజుకోనుందని చెప్పారు.

కంపెనీ 42వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా మాట్లాడుతూ వాటాదారులకు భవిష్యత్ వ్యూహాలను వెల్లడించారు. పెరగనున్న స్టీల్ డిమాండ్‌కు అనుగుణంగా ఆధునీకరణ, నాణ్యత, సాంకేతికత వంటి అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా అదుపును చేపట్టినట్లు వివరించారు. వీటికితోడు ఉత్పత్తులను మెరుగుపరచడం, పనితీరును పటిష్టపరచడం వంటి చర్యలకు తెరలేపినట్లు తెలిపారు.

బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు తయారీసహా మరిన్ని రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశమివ్వడం ద్వారా ప్రభుత్వం వృద్ధికి బాటలు వేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటపడితే స్టీల్‌కు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. వెరసి రానున్న కాలంలో దేశీయంగా స్టీల్ వినియోగం ఊపందుకోనుందని అంచనా వేశారు.

 విజన్ 2025లో భాగంగా...
 ప్రస్తుతం చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు కాకుండా విజన్ 2025 ప్రణాళిక అమలుకు సిద్ధపడుతున్నట్లు వర్మ చెప్పారు. ప్రణాళికలో భాగంగా రూ. 1,50,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా హాట్‌మెటల్ సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు వెల్లడించారు. మహారత్న కంపెనీ అయిన సెయిల్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2013-14) 21% అధికంగా రూ. 2,616 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడంతోపాటు, వాటాదారులకు 20.20% డివిడెండ్‌ను చెల్లించినట్లు వివరించారు. అంతేకాకుండా కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 51,866 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు తెలిపారు. ఈ బాటలో 8.6% వృద్ధితో 12.09 మిలియన్ టన్నుల స్టీల్‌ను విక్రయించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు