సెయిల్‌కు రూ.554 కోట్ల లాభం

3 Nov, 2018 00:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్‌ కంపెనీ సెయిల్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు రూ.553.69 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా నమోదైంది.

సామర్థ్యం మేరకు నిర్వహణ, రైల్వే అవసరాలైన చక్రాలు, యాక్సిల్స్‌ను సమకూర్చడం తమ ప్రాధాన్యతలని సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ చౌదరి తెలిపారు. కొత్త ఉత్పత్తులతో కస్టమర్లను చేరుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. కంపెనీ నిర్వహణ పనితీరు, లాభాల్లో వేగవంతమైన రికవరీ, విస్తరణ, ఆధునికీకరణ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు చేసిన సమష్టి కృషి ఫలితమే ఇదని కంపెనీ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు