సెయిల్‌ లాభం రూ.540 కోట్లు 

4 Aug, 2018 00:08 IST|Sakshi

గత క్యూ1లో రూ.801 కోట్ల నష్టాలు  

మొత్తం ఆదాయం 16,005 కోట్లకు

న్యూఢిల్లీ: దేశంలో అతి పెద్ద ఉక్కు కంపెనీ, సెయిల్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.540 కోట్ల నికర లాభం(స్టాండెలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.801 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటం, ధరలు పెరగడంతో ఈ క్యూ1లో భారీ స్థాయిలో నికర లాభం సాధించామని సెయిల్‌ చైర్మన్‌ సరస్వతీ ప్రసాద్‌ తెలిపారు. గత క్యూ1లో రూ.13,073 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.16,005 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యయాలు రూ.14,350 కోట్ల నుంచి రూ.14,900 కోట్లకు ఎగిశాయని వివరించారు. ఈ క్యూ1లో విక్రయించదగ్గ ఉక్కు ఉత్పత్తి 13 శాతం పెరిగి 3.61 మిలియన్‌ టన్నులకు చేరిందని పేర్కొన్నారు.

అమ్మకాలు 8 శాతం వృద్ధితో 3.271 మిలియన్‌ టన్నులకు పెరిగాయని వివరించారు. ఇబిటా 23 శాతం వృద్ధితో రూ.2,685 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో టన్నుకు ఇబిటా ఈ క్యూ1లో రూ.8,211గా నమోదైందని వివరించారు. కంపెనీ నిర్వహణ పనితీరు రికార్డ్‌ స్థాయిలో మెరుగుపడిందని సరస్వతీ ప్రసాద్‌ తెలిపారు. ఇదే జోరు కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తాము తీసుకున్న పలు కొత్త చర్యలు కంపెనీ పనితీరు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి కారణమయ్యాయని వివరించారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో సెయిల్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.79 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు