సెయిల్ నష్టాలు రూ.1,529 కోట్లు

10 Feb, 2016 00:36 IST|Sakshi
సెయిల్ నష్టాలు రూ.1,529 కోట్లు

న్యూఢిల్లీ: ధరలు తగ్గి చైనా తదితర దేశాల నుంచి ఉక్కు దిగుమతులు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూసింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ3లో ఏకంగా రూ. 1,529 కోట్ల నష్టాలు నమోదు చేసింది. అంతక్రితం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 579 కోట్ల లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 19.5 శాతం క్షీణించి రూ. 11,107 కోట్ల నుంచి రూ. 8,939 కోట్లకు తగ్గింది.

వ్యయాలు స్వల్పంగా పెరిగి రూ. 10,371 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ3లో నికర అమ్మకాలు 24 శాతం తగ్గడంతో నికరంగా రూ. 1,529 కోట్ల నష్టాలు వచ్చాయని సెయిల్ ఒక ప్రకటనలో తెలిపింది. చైనాలో వినియోగం మందగించడం దరిమిలా అంతర్జాతీయంగా ఉక్కు ధరలు 460 డాలర్ల నుంచి 280 డాలర్లకు పడిపోవడం, చౌకగా దిగుమతులు మార్కెట్లను ముంచెత్తడం తెలిసిందే. అంతర్జాతీయంగా ధరల పతనంతో దేశీ ఉక్కు సంస్థలకు ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయని సెయిల్ చైర్మన్ పి.కె. సింగ్ తెలిపారు. అయితే, ప్రభుత్వం ఇటీవల ఇన్‌ఫ్రా రంగానికి ఊతమిచ్చే చర్యలు ప్రకటించడంతో ఉక్కు వినియోగం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు