సైయంట్ నికర లాభం రూ. 68 కోట్లు

18 Jul, 2014 00:37 IST|Sakshi
సైయంట్ నికర లాభం రూ. 68 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసుల కంపెనీ సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2013-14 తొలి త్రైమాసికంలో రూ.54 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 68 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 28 శాతం వృద్ధితో రూ. 483 కోట్ల నుంచి రూ. 621 కోట్లకు పెరిగింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా త్రైమాసిక ఆదాయం 100 మిలియన్ డాలర్ల మార్కును అందుకుందని, కొత్త కంపెనీలను టేకోవర్ చేయడం వంటివి లేకుండానే ఈ మార్కును అందుకున్నామని సైయంట్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కృష్ణ భోధనపు పేర్కొన్నారు.

 ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్లు మంచి పనితీరు కనపర్చాయని, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 12.3 శాతం వృద్ధి నమోదయ్యిందన్నారు.  సమీక్షాకాలంలో నిర్వహణా లాభం తగ్గడంపై కృష్ణ స్పందిస్తూ డాలరు విలువ క్షీణత, జీతాల పెంపుతో మార్జిన్లపై ఒత్తిడి ఉందని, రానున్న కాలంలో మార్జిన్లు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షా కాలంలో నికరంగా 445 మంది ఉద్యోగులను చేర్చుకోగా, ఇంజనీరింగ్ విభాగంలో ఆరుగురు, డీఎన్‌వో విభాగంలో ముగ్గురు క్లెయింట్లు చేరారు.

 విమాన విడిభాగాల ప్రదర్శన కేంద్రం
 అతర్జాతీయంగా విమాన ఇంజన్ల తయారీలో పేరొందిన ప్రాట్ అండ్ విట్నీ(పీడబ్ల్యూ)తో కలిసి సైయంట్ హైదరాబాద్‌లో విమాన విఢిభాగాల ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎక్స్‌పీరియన్స్ కేంద్రంలో పీడబ్ల్యూ 4090 భారీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌తో పాటు, వివిధ కంపెనీలకు చెందిన విమాన తయారీ యంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. మణికొండలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సైయంట్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డితో పాటు, పీడబ్ల్యూ వైస్ ప్రెసిడెంట్  జయంత్ సబనీస్‌లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయి విమాన విడిభాగాలను నేరుగా చూడటం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు మరింతగా నాలెడ్జ్‌ను పెంచుకునే అవకాశం కలుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు