ఉద్యోగం పోయినా... నిధి ఉండాలి!

26 Mar, 2017 23:49 IST|Sakshi
ఉద్యోగం పోయినా... నిధి ఉండాలి!

వివిధ రంగాల్లో తగ్గుతున్న ఉద్యోగాలు
ఉన్నట్టుండి తొలగిస్తున్న ప్రైవేటు సంస్థలు
♦  తగినంత నిధి లేకుంటే ఇబ్బందుల పాలు
♦  బీమా సహా అవసర రక్షణలు తప్పనిసరి


స్నాప్‌డీల్‌ 500 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇస్తున్నట్టు చెప్పేసింది. అంటే వారికి ఉద్వాసన చెప్పినట్టే!! భారీగా ఉద్యోగాలను కల్పిస్తున్న బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ఆటోమేషన్‌ కారణంగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిసెంబర్‌ క్వార్టర్లో 4,500 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. టెలికం కంపెనీలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అసలు ఏ రంగంలో పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్థితి. మరి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే? అప్పటి వరకు జీతంతో సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి స్పీడ్‌ బ్రేకర్లు ఎదురైతే...? ఆదుకునేందుకు ఓ నిధి తప్పనిసరి. ఉద్యోగం ఊడినా ఈ నిధితో మళ్లీ ఉద్యోగం వచ్చే వరకూ కుటుంబ అవసరాలు తీరాలి. అందుకే ముందుచూపుతో జాబ్‌ లాస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇటువంటి ఆకస్మిక పరిణామాలను సులభంగా తట్టుకోవచ్చు.

మన దేశంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగం కోల్పోతే... దాదాపు ఎలాంటి రక్షణా ఉండదనే చెప్పాలి. కంపెనీ నుంచి వెళ్లిపోతే చెల్లించే సెవరెన్స్‌ పే కొన్ని సంస్థల్లోనే ఉంది. మేనేజ్‌మెంట్‌ నిపుణులకు ఉద్యోగం కోల్పోతే మూడు నుంచి ఆరు నెలలు, కొన్ని కంపెనీల్లో 12 నెలల వేతనాన్ని సెవరెన్స్‌ పే కింద చెల్లిస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. సంస్థను బట్టి మారుతుంటుంది. అందుకే ఇలాంటి వాటిని నమ్ముకోకుండా ఉద్యోగం లేని పరిస్థితికి సన్నద్ధంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఉద్యోగం పోతే పెట్టుబడులు, రుణాల చెల్లింపులు, కుటుంబ అవసరాలకు విఘాతం కలగని విధంగా ప్రణాళిక వేసుకోవాలి.

కంటింజెన్సీ ఫండ్‌ (అత్యవసర నిధి)
ప్రతి కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం మూడు నుంచి ఆరు నెలల అవసరాలకు, బీమా చెల్లింపులు, రుణాల చెల్లింపులకు సరిపడా ఈ నిధిని సమకూర్చుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిళ్లతో కూడిన రంగంలో పనిచేస్తుంటే మాత్రం అత్యవసర నిధి ఏడాది అవసరాలను తీర్చేంత ఉండాలి. ఈ నిధిని షార్ట్‌ టర్మ్‌ డెట్‌ఫండ్స్, లిక్విడ్‌ ఫండ్స్, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉంచితే అవసరమైన వెంటనే వినియోగించుకోవటానికి అనువుగా ఉంటుంది.

ఉద్యోగాన్ని బట్టి నిధి
కంటింజెన్సీ ఫండ్‌ ఎంతన్నది చేస్తున్న ఉద్యోగం సీనియారిటీ, రంగాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే జూనియర్‌ లెవల్‌ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా దాన్ని కోల్పోతే నెలల వ్యవధిలో తిరిగి వేరొక ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. అదే మధ్య స్థాయి ఉద్యోగి అయితే మూడు నుంచి నాలుగు నెలలు పట్టొచ్చు. ఇక వైస్‌ ప్రెసిడెంట్‌ లేదా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంటి సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగం అయితే తిరిగి తనకు సరిపడే ఉద్యోగాన్ని సొంతం చేసుకునేందుకు ఏడాది పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విమానయాన రంగంలోని వారైతే ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అదే ఆరోగ్యరంగం, ఫార్మాలో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే కొత్త ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలరు.

అందుకే తామున్న రంగం, ఉద్యోగ స్థాయిల ఆధారంగా తిరిగి ఉద్యోగం సంపాదించేందుకు గరిష్టంగా పట్టే కాలానికి అవసరాలను తీర్చేలా కంటింజెన్సీ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. అత్యవసర నిధి జీవిత బీమా పాలసీ, వైద్య బీమా, ప్రమాద బీమా పాలసీ వార్షిక ప్రీమియాన్ని చెల్లించేదిగా ఉండాలి. సొంత కారు, ఇల్లు ఉంటే వాటి బీమాలను కూడా కవర్‌ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం లేదు కదా అని బీమా రక్షణలు అనవసరం అయిపోవు కదా. ఒకవేళ ఉద్యోగం లేదులే అనుకుని వైద్య బీమా ప్రీమియం చెల్లించడం మానేశారనుకోండి. ఉన్నట్టుండి కుటుంబంలో ఎవరైనా ఆస్పత్రి పాలైతే ఆ భారాన్ని భరించడం తలకుమించినది అవుతుంది. అందుకే ఉద్యోగం లేకున్నా బీమా రక్షణ కొనసాగాలి. అది కూడా సరిపడినంత ఉండాలి.

పెట్టుబడుల విషయంలో పునరాలోచన
రిస్క్‌తో కూడిన పెట్టుబడులను ఉద్యోగం లేని సమయంలో సమీక్షించుకోవడం సరైనదే. ఉదాహరణకు యులిప్‌ పాలసీ ఉందనుకోండి. దాన్ని విక్రయించేసి నగదు చేసుకోవడం సరైనదేనని ఆర్థిక నిపుణుల సలహా. ఒకవేళ కొనసాగించదలచుకుంటే పెట్టుబడుల తీరును మార్చుకోవాలి. ఉద్యోగం లేదు గనుక రిస్క్‌ తగ్గించుకునేందుకు ఈక్విటీకి కేటాయింపులు తగ్గించి, డెట్‌కు కేటాయింపులు పెంచుకోవాలి. తిరిగి ఉద్యోగం సంపాదించిన తర్వాత మళ్లీ ఈక్విటీ కేటాయింపులు పెంచుకోవచ్చు.

రుణాల్ని సమీక్షించుకోవాలి
ఉద్యోగం లేకపోయినా తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లింపులు ఆగకుండా కొనసాగించాలి. ఉద్యోగం లేని సమయంలో రుణం మొత్తాన్ని తీర్చేసే ఆలోచన సరైనది కాదు. ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు కష్టంగా ఉంటే... రుణ కాల వ్యవధిని పెంచుకోవడం ద్వారా నెలవారీ వాయిదాను కొద్ది మేర తగ్గించుకోవచ్చు. ఇక క్రెడిట్‌ కార్డు రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ అధికంగా ఉండడమే కాదు, సకాలంలో చెల్లింపులు చేయకుంటే వడ్డనలు భారీగా ఉంటాయి. చెల్లింపులు కష్టమైతే తిరిగి ఉద్యోగం వచ్చే వరకు మారటోరియం విధించాలని రుణ దాతలను కోరవచ్చు. అయితే, ఇది రుణదాత ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కొత్తగా వేరొక రుణం తీసుకుని ప్రస్తుత రుణం తీర్చివేసే ఆలోచనలు కూడా సమంజసం కాదని నిపుణులు సూచిస్తున్నారు.

ఖర్చుల తీరు మారాలి
ఉద్యోగం లేకపోయినా విచక్షణా రహిత ఖర్చులు శ్రేయస్కరం కాదు. ఈఎంఐ, బీమా ప్రీమియం, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు తప్పనిసరి అవసరాలు. ఇక వినోదం, రెస్టారెంట్లలో విందులు, పర్యటనలు వంటి అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి.  

ఉద్యోగం పోతే బీమా...?
ఉద్యోగం లేని సమయంలో రక్షణ కల్పించేందుకు వీలుగా పాలసీలున్నాయి. ఉద్యోగం ఊడితే మూడు నెలల పాటు ఖర్చులకు పరిహారం చెల్లిస్తాయి. మూడు నెలల వరకు వేతనం, నెలవారీ ఈఎంఐలకు చెల్లింపులు చేస్తాయి. కానీ వీటికి కొన్ని షరతులు కూడా విధిస్తాయి. పనితీరు బాగాలేక ఉద్యోగం కోల్పోతే పరిహారం ఇవ్వవు. మోసపూరిత ఆరోపణలపై ఉద్యోగం పోయినా పరిహారం చెల్లించవు. పైగా ఉద్యోగం పోయిన దగ్గర్నుంచి 90 రోజుల పాటు కొత్తగా ఉద్యోగం చేపట్టకూడదు. అది కూడా పాలసీ కాల వ్యవధిలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతేనే రక్షణ. రెండోసారి ఉద్యోగం పోతే బీమా కవరేజీ ఉండదు. పైగా ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక ఇది అంత ఉపయోగకరం కాదన్నది ఆర్థిక సలహాదారుల సూచన.

–సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

మరిన్ని వార్తలు