ఇది.. A టు Z జ్యుయలరీ!

31 Oct, 2015 01:17 IST|Sakshi
పూజ బన్సాల్ (సీఈఓ, మైహీరా.కామ్)

సరికొత్త ఆలోచనతో.. ఉపయోగపడే సేవలందించే ఏ సంస్థనైనా ప్రజలు ఆదరిస్తారు. దాన్ని నిరూపిస్తున్నాయి కొన్ని స్టార్టప్‌లు. విద్య, వైద్యం, షాపింగ్, మొబైల్, టెక్నాలజీ.. ఇలా ప్రతి విభాగం నుంచి అలాంటి స్టార్టప్‌లను ఎంపిక చేసి... వాటిపై ప్రత్యేక కథనాలు అందిస్తోంది ‘సాక్షి స్టార్టప్ డైరీ’. దీన్ని చూసి దేశంలోని వివిధ నగరాల నుంచి పలు స్టార్టప్‌లు తమ విజయ గాధను, వివరాలను ‘సాక్షి’కి మెయిల్ చేస్తున్నాయి. ఇలా వస్తున్న మెయిల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది...

వారానికోసారి ప్రచురిస్తుండటం వల్ల కొన్నిటినే ఇవ్వగలుగుతున్నాం. కొంత ఆలస్యమైనా వినూత్న స్టార్టప్‌ల గురించి ప్రచురిస్తామని చెబుతూ... ఈ వారం మీకోసం అలాంటి  స్టార్టప్ వివరాలివి...
 
బంగారం, వజ్రాలు, ప్లాటినం వంటి విలువైన ఆభరణాలు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అవి తయారుచేసే సంస్థలు, అమ్మకందార్ల గురించి తెలుసుకోవాలంటే ? అదీ ఆన్‌లైన్ వేదికగా!! ఎవరికి వారే తాము గొప్పంటే తామంటూ చెప్పుకొంటారు. మరెలా.. దేశంలోని జ్యుయలరీ పరిశ్రమనంతటినీ ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చింది మైహీరా.కామ్. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మైహీరా.కామ్‌ను ఈ ఏడాది సెప్టెంబరు 17న ఆరంభించారు పూజా బన్సాల్.

జెమ్స్, జ్యుయలరీ తయారీదారులు, ట్రేడర్స్, సప్లయర్స్, హోల్‌సేలర్స్ మాత్రమే కాదు... జ్యుయలరీ ల్యాబొరేటరీ, ఇనిస్టిట్యూట్స్, ఫొటోగ్రఫీ, డిజైన్స్ వంటివి కూడా ఇందులో రిజిస్టరై ఉన్నాయి. 195 రకాల కేటగిరీలను మై హీరా.కామ్‌లో చూడొచ్చు. దీని గురించి పూజ ఏమన్నారంటే...
 
‘‘దేశంలో 8 వేల ఆభరణాల సంస్థలు రిజిస్టరై ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పి.మంగత్‌రామ్, ఎస్‌ఏపీ, శ్రీబాలాజీ, కైలాశ్‌నాథ్ వంటి 290 జ్యుయలరీ సంస్థలున్నాయి. ఇక గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సంస్థలు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 25 వేల సంస్థలను నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందుకే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాం.

ఇక రోజుకు 40-50 వేల మంది కస్టమర్లు మా సైట్‌ను సందర్శిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీన్ని 60 లక్షలకు చేర్చాలని లక్ష్యించాం. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు సిల్వర్ అయితే ఏటా రూ.50 వేలు, గోల్డ్ అయితే రూ.లక్ష చార్జీ ఉంటుంది. సిల్వర్ విభాగం కింద 200 ఉత్పత్తులను, 50 లీడ్లను తీసుకోవచ్చు. గోల్డ్‌కైతే రెండితల లాభం ఉంటుంది’’ అని వివరించారు పూజ. రూ.కోటితో ఆరంభించిన మై హీరా.కామ్ తరఫున 6 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

>
మరిన్ని వార్తలు