షాకింగ్‌ : ఈ ఏడాది వేతన పెంపు అరకొరే..

19 Feb, 2020 10:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లింది. వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో 2020లో సగటు వేతన పెంపు పదేళ్ల కనిష్టస్ధాయిలో 9.1 శాతానికే పరిమితమవుతుందని ప్రముఖ ప్రొషెషనల్‌ సేవల సంస్థ ఏఓన్‌ పీఎల్‌సీ వార్షిక వేతన పెంపు సర్వే వెల్లడించింది. 2018, 2019లో కంపెనీలు వరుసగా సగటున 9.5, 9.3 శాతం మేర వేతనాలను పెంచాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కుదిపివేసిన క్రమలో ఆ ఏడాది సగటు వేతన పెంపు 6.6 శాతమే.

ఇక 2020లో సగటు వేతన పెంపు స్వల్పమేనని సర్వే వ్యాఖ్యానించింది. అయితే వేతన పెంపు కనిష్టంగా ఉన్నప్పటికీ పలు కంపెనీలు పది శాతం కంటే అధికంగా ఇంక్రిమెంట్లు ఇవ్వనుండటం​ ఊరట ఇవ్వనుంది. 2020లో రెండంకెల వేతన వృద్ధిని చేపడతామని 39 శాతం కంపెనీలు వెల్లడించాయని సర్వే తెలిపింది. 2012 నుంచి 2016 వరకూ వేతనాలు రెండంకెల వృద్ధి సాధించాయని, ఇటీవల సంవత్సరాల్లో 9 శాతానికి తగ్గాయని సర్వే తెలిపింది. 20 రంగాలకు చెందిన 1000 కంపెనీలను ఈ సర్వే పలుకరించి శాలరీ ట్రెండ్స్‌ను పసిగట్టింది. తయారీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల్లో వేతన పెంపు అధికంగా ఉంటుందని వెల్లడించింది.

చదవండి : జీతాలతో పనేముంది?

మరిన్ని వార్తలు