అమ్మకానికి ఐవీఆర్‌సీఎల్‌

7 Sep, 2019 10:00 IST|Sakshi

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎడాపెడా అప్పులు చేసి... ఆనక తీర్చలేక దివాలా తీసిన మౌలిక రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌... అమ్మకానికి వచ్చింది. దీని కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు బిడ్లు వేయొచ్చంటూ కంపెనీ లిక్విడేటర్‌ సుతాను సిన్హా కోరారు. దీనికి రిజర్వు ధరను రూ.1,654.47 కోట్లుగా నిర్ణయించారు. అక్టోబరు 4న ఎలక్ట్రానిక్‌ వేలం ఉంటుందని లిక్విడేటర్‌గా కూడా వ్యవహరిస్తున్న దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) తెలియజేశారు. దివాలాతీసిన ఐవీఆర్‌సీఎల్‌ను గట్టెక్కించేందుకు సరైన పరిష్కారం లభించకపోవడంతో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఈ ఏడాది జూలై 29న కంపెనీ లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.800 కోట్ల నికర నష్టం ప్రకటించింది. దీంతో సంస్థ మొత్తం నష్టాలు రూ.6,102 కోట్లకు చేరుకున్నాయి. వడ్డీతో కలిసి ఫండ్‌ ఆధారిత బకాయిలు రూ.9,593 కోట్లు,  ఫండేతర బకాయిలు రూ.857 కోట్లు సంస్థ చెల్లించాల్సి ఉంది.

ఫస్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌..
ఐవీఆర్‌సీఎల్‌ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఫస్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ బిడ్లు వేసి ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌ మొత్తం తక్కువగా ఉండడంతో.. కొత్త ప్రతిపాదనతో ముందుకు రావాలని రుణగ్రహీతలు స్పష్టం చేశారు. దీంతో ఫస్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ మరో ఆఫర్‌తో ముందుకొచ్చినా రుణదాతల సమ్మతిని పొందలేకపోయింది. దీంతో ఆస్తులను విక్రయించాలంటూ (లిక్విడేషన్‌) రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఎన్‌సీఎల్‌టీ అందుకు అనుకూలంగా స్పందించి ఉత్తర్వులిచ్చింది. ఐవీఆర్‌సీఎల్‌కు రుణమిచ్చిన ఎస్‌బీఐ దరఖాస్తు ఆధారంగా ట్రిబ్యునల్‌ జ్యూడీషియల్‌ మెంబర్‌ కె.అనంత పద్మనాభస్వామి లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చారు. కాగా ఐవీఆర్‌సీఎల్‌కు 2009-10 నుంచి కష్టాలు మొదలయ్యాయి. తీసుకున్న అప్పులపై వడ్డీ రేట్లు భారం కావడం, రుణాలు అధికమవడం, చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవడంతో కంపెనీ క్రమంగా కుదేలైంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా