శాంసంగ్‌ను వీడని పేలుడు కష్టాలు

23 Oct, 2017 12:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కొరియా మొబైల్‌దిగ్గజం​  శాంసంగ్‌ను స్మార్ట్‌ఫోన్‌ పేలుడు కష్టాలు వీడడం లేదు. తాజాగా ఢిల్లీనుంచి ఇండోర్‌కు బయలుదేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో పేలిన మొబైల్‌ శాంసంగ్‌ గెలాక్సీ జె 7 గా తేలింది.   శాంసంగ్‌ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది.
 హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం,  శాంసంగ్  గెలాక్సీ జె7  డివైస్‌ ఢిల్లీ- ఇండోర్ జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిపోయింది. ఈ ప్రమాదంపై శాంసంగ్‌  ఇండియా అధికార ప్రతినిధి  స్పందిస్తూ మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామనీ, కస్టమర్ భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత  అని ప్రకటించారు. 120  మంది ప్రయాణీకులతో  విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఈ  పేలుడు సంభవించింది.   ఒక ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా అకస్మాత్తుగా మంటలంటుకొని, పొగలు వ్యాపించడంతో  ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు విమానంలో ఉన్న అగ్నిమాపక  పరికరం చేయకపోవడంతో.. నీళ్లు చల్లి మంటల్ని అదుపు చేయడం మరో వివాదానికి దారి తీసింది. అటు డీజీసీఎస్‌  మార్గదర్శకాలన్నింటినీ తాము పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

కాగా గత ఏడాది  శాంసంగ్‌ నోట్‌ 7 పేలుళ్లతో  కంపెనీ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో చాలా గ్యాప్‌ తరువాత ఇటీవల శాంసంగ్‌ ఎస్‌ 8, గెలాక్సీ్‌  నోట్‌ 8 ను లాంచ్‌ చేసింది.  ఈ నేపథ్యంలో మళ్లీ  విమానంలో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ పేలడం కలకలం రేపింది.
 

మరిన్ని వార్తలు