భారత్‌లోకి శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4..

15 Oct, 2014 00:37 IST|Sakshi
భారత్‌లోకి శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4..

న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ 4 ఫ్యాబ్లెట్‌ను భారత మార్కెట్లోకి మంగళవారం ప్రవేశపెట్టింది. ధర రూ.58,300. దీనితో పాటు శామ్‌సంగ్ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్(ధర రూ.28,900), గేర్ సర్కిల్(ధర రూ.8,500) డివైస్‌లను కూడా శామ్‌సంగ్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది.

శామ్‌సంగ్ ఖరీదైన స్మార్ట్‌డివైస్
ఈ గెలాక్సీ నోట్ 4 డివైస్‌ను శామ్‌సంగ్ కంపెనీ గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించింది.  దీపావళి సందర్భంగా గెలాక్సీ నోట్ 4ను మార్కెట్లోకి తెస్తున్నామని శామ్‌సంగ్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ (మొబైల్ అండ్ ఐటీ) ఆశిమ్ వార్శి చెప్పారు.  శామ్‌సంగ్ కంపెనీ భారత్‌లో అందిస్తున్న అత్యంత ఖరీదైన స్మార్ట్ డివైస్ ఇది.  గెలాక్సీ నోట్ 3(ఎన్900)ను రూ.38,900కు, గెలాక్సీ 5ఎస్‌ను రూ.36,000కు కంపెనీ విక్రయిస్తోంది.

మెరుగుపరిచిన ఎస్‌పెన్ ఫీచర్‌తో, పెద్ద డిస్‌ప్లే, అత్యున్నతమైన ఫీచర్లతో గెలాక్సీ నోట్4ను రూపొందించామని ఆశిమ్ వివరించారు.  ఈ గెలాక్సీ నోట్ 4లో 5.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3.7 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. వేగంగా చార్జింగ్ కావడం ఈ ఫ్యాబ్లెట్ ప్రత్యేకత అని ఆశిమ్ వివరించారు. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు