10 వేలకే శామ్‌సంగ్ 4జీ ఫోన్

17 Feb, 2015 02:24 IST|Sakshi
10 వేలకే శామ్‌సంగ్ 4జీ ఫోన్

‘జే1’ ధర రూ. 9,900
* శామ్‌సంగ్ ఫోరం-2015లో ఆవిష్కరణ
* గెలాక్సీ గ్రాండ్, కోర్‌లలోనూ 4జీ వెర్షన్లు
* మార్కెట్లోకి గెలాక్సీ ఏ7; ధర 30,500
* తొలిసారిగా ఎస్‌యూహెచ్‌డీ టీవీ, కన్వర్టబుల్ ఫ్రిజ్ ఆవిష్కరణ
బ్యాంకాక్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి ఎం.శివరామకృష్ణ

మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శామ్‌సంగ్ సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మూడు కొత్త 4జీ ఫోన్‌లను అందుబాటులోకి తెస్తోంది. సోమవారమిక్కడ జరిగిన ‘శామ్‌సంగ్ ఫోరం 2015’ సదస్సులో స్మార్ట్‌ఫోన్‌లతోపాటు తొలిసారిగా అత్యాధునిక ఎస్‌యూహెచ్‌డీ టీవీ, ప్రపంచంలోనే మొట్టమొదటి కన్వర్టబుల్ రిఫ్రిజరేటర్ ఇతరత్రా ఉత్పత్తులను ఆవిష్కరించింది.  

భవిష్యత్తులో ఇక అన్ని ఉత్పత్తులూ ఇంటర్నెట్‌తో తప్పనిసరిగా అనుసంధానం కావాల్సి ఉంటుందని, అందుకే తాము ఐఒటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)పై మరింత దృష్టి కేంద్రీకరించామని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ (సౌత్‌వెస్ట్ ఆసియా) హెచ్‌సీ హాంగ్ చెప్పారు. స్మార్ట్ సెన్సర్స్, ప్రాసెస్ వంటివి ఇందులో ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. మరో ఐదేళ్లలో ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తీ ఈ ఐఓటీతోనే వస్తుందని... 2017కల్లా తమ టీవీలన్నింటిలో ఈ టెక్నాలజీని చేరుస్తామని హాంగ్ వెల్లడించారు. 2014లో శామ్‌సంగ్ భారత్‌లో రెండో అతిపెద్ద కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా నిలిచిందని... కంపెనీ కన్సూమర్ డ్యూరబుల్స్ అమ్మకాలు రెట్టింపయ్యాయని ఆయన తెలియజేశారు. భారత్ మార్కెట్‌లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, స్థానిక కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ‘మేక్ ఫర్ ఇండియా’ ఉత్పత్తులను ప్రవేశపెడతామని వెల్లడించారు.
 
భవిష్యత్తులో అన్నీ స్మార్ట్ టీవీలే...
శామ్‌సంగ్.. మొట్టమొదటిసారిగా ఎస్ అల్ట్రా హైడెఫినిషన్(ఎస్‌యూహెచ్‌డీ) పరిజ్ఞానంతో 88 అంగుళాల ‘జేఎస్ 9500’ కర్వ్‌డ్ స్మార్ట్ టీవీని ఫోరంలో ఆవిష్కరించింది. దీనిలో నానో క్రిస్టల్ టెక్నాలజీతో దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుందని శామ్‌సంగ్ ఇండియా సేల్స్ డెరైక్టర్ రాజీవ్ భుటారీ చెప్పారు. సాధారణ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీతో పోలిస్తే దృశ్యం 200 శాతం స్పష్టంగా ఉంటుందన్నారు. ఇది తాము కొత్తగా  తీసుకొచ్చిన ‘టైజన్’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని, భవిష్యత్తులో ఇక అన్నీ స్మార్ట్ టీవీలే ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ ఏడాది జాయ్ స్మార్ట్ సిరీస్‌లో కొత్త టీవీలను ప్రవేశపెడతామన్నారు.

ఇవి కాకుండా చిన్న, మధ్య తరహా సంస్థల కోసం స్మార్ట్ సైనేజ్ టీవీలు, యాక్టివ్ ట్యాబ్లెట్ పీసీలను కూడా కంపెనీ ఆవిష్కరించింది. అటు నియో సిరీస్ కింద తక్కువ విద్యుత్ వినియోగించే డిజిటల్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఎయిర్ కండీషనర్, యాక్టివ్ వాష్ ప్లస్ పేరిట వాషింగ్ మెషీన్లను శామ్‌సంగ్ ప్రవేశపెట్టింది. కన్వర్టబుల్ ఫ్రిజ్‌లో అదనపు స్టోరేజ్ కోసం ఫ్రీజర్ భాగాన్ని కూడా మరింత మెరుగ్గా ఉపయోగించుకునే వీలుంటుంది.
 
4జీపై దృష్టి ...
భారత్‌లో 4జీ సేవలు జోరందుకుంటుండటంతో ఈ విభాగంలో మరిన్ని ఫోన్‌లను శామ్‌సంగ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ‘జే1’ పేరుతో చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర భారత్‌లో రూ. 9,900గా ఉంటుంది. అలాగే, గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్, గెలాక్సీ కోర్ ప్రైమ్ పేరిట మరో రెండు 4జీ ఫోన్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఇక, గెలాక్సీ సిరీస్‌లో అత్యంత సన్నని (6.3 మిల్లీమీటర్ల మందం) ఏ7 హ్యాండ్‌సెట్‌నూ కంపెనీ ప్రవేశపెట్టింది. దీని ధర 30,499. ఇది సోమవారం నుంచి భారత మార్కెట్లో లభిస్తుందని, మిగతా మూడు స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు మార్చి రెండో వారం నుంచి మొదలవుతాయని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అసీమ్ వర్సి తెలిపారు.
 
జే1, ఏ7 ప్రత్యేకతలు..

చౌక 4జీ ఫోన్ జే1 హ్యాండ్‌సెట్‌లో 4.3 అంగుళాల స్క్రీన్, 5 మెగాపిక్సెల్ కెమెరా (వెనుకవైపున), 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. మరోవైపు, గెలాక్సీ ఏ7లో 5.5 అంగుళాల స్క్రీన్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2జీబీ ర్యామ్, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మొదలైన ప్రత్యేకత లున్నాయి.

మరిన్ని వార్తలు