స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో  ‘శాంసంగ్‌’ టాప్‌ 

4 Oct, 2018 01:09 IST|Sakshi

ప్రీమియం విభాగంలో నెంబర్‌ వన్‌ 

62.5 శాతం మార్కెట్‌ వాటా 

జీఎఫ్‌కే అధ్యయనంలో వెల్లడి 

న్యూఢిల్లీ: ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ విభాగ అమ్మకాల్లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం సెగ్మెంట్‌ ఆగస్టు విక్రయాల్లో ఈ సంస్థ విలువ పరంగా 60 శాతం మార్కెట్‌ వాటాను, సంఖ్య పరంగా 62.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు.. జర్మనీకి చెందిన మార్కెట్‌ పరిశోధన సంస్థ జీఎఫ్‌కే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మార్కెట్‌ వాటా ఆగస్టులో ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ‘శాంసంగ్‌ నోట్‌ 9’ విడుదలేనని అధ్యయనంలో తేలింది.

ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన శాంసంగ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ ఆదిత్య.. ‘నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 24న నోట్‌ 9 విడుదల జరిగినప్పటికీ, అదే నెల 10 నుంచే రూ.6,000 క్యాష్‌ బ్యాక్‌ వంటి పలు ఆఫర్లతో ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించడం వల్ల ఇది సాధ్యపడింది. అక్టోబర్‌–డిసెంబర్‌ పండుగల సీజన్‌లో 20–25 శాతం వృద్ధిరేటును అంచనావేస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. రూ.40,000 మించిన స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 55.5 శాతం, రూ.30,000 మించిన స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో 55 శాతం మార్కెట్‌ వాటాను ఆగస్టులో ఈ సంస్థ కైవసం చేసుకుంది. ఇక అక్టోబర్‌ 11న రూ.30,000 స్థాయి మించిన స్మార్ట్‌ఫోన్‌ ఏ9 విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు