యాపిల్ ఇండియాకు కొత్త అధినేత వస్తున్నాడు

8 May, 2016 13:12 IST|Sakshi
యాపిల్ ఇండియాకు కొత్త అధినేత వస్తున్నాడు

న్యూఢిల్లీ : కుపెర్టినో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇండియాకు కొత్త అధినేత వచ్చేస్తున్నాడట. సంజయ్ కౌల్ ను యాపిల్ ఇండియాకు కొత్త మేనేజర్ గా నియమించనున్నట్టు సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కెనడా పౌరుడు అయిన కౌల్ కు 2011 నవంబర్ నుంచి యాపిల్ తో సంబంధం ఉంది. యాపిల్ ఐఫోన్ల బిజినెస్ ను అతనే చూసుకునేవాడు. యాపిల్ ఇండియాకు అధినేతగా ఉన్న మనీష్ ధిర్ జనవరిలో కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగడంతో, యాపిల్ ఈ బాధ్యతలను సంజయ్ కౌల్ కు అప్పజెప్పుతున్నట్టు తెలుస్తోంది.

కౌల్ యాపిల్ కంపెనీలో చేరకముందు, బ్లాక్ బెర్రీకి కెపాసిటీ డైరెక్టర్ గా పనిచేశాడు. ఎయిర్ టెల్ బ్లాక్ బెర్రీ బిజినెస్ ను మూడు అంకెల వృద్ది శాతానికి తీసుకురావడంలో కౌల్ కీలక పాత్ర పోషించాడు. బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ(టెక్) ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన కౌల్,1988లో గుస్తవ్ సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ పై ఎమ్ బీఏ పట్టా అందుకున్నాడు. అనంతరం 2008లో ఇండియాకు తిరిగి వచ్చాడు.

ప్రీమియం మార్కెట్లో ఆధిక్యంలో ఉన్న శామ్ సంగ్ ను అధిగమించడానికి యాపిల్ ఎక్కువగా కృషిచేస్తోంది. మార్కెట్లో అన్ని ఉత్పత్తులకూ భారత మార్కెట్ ఎంతో కీలకమని, భారత్ లో బిజినెస్ పెంచుకోవడానికి యాపిల్ ఎక్కువ దృష్టిపెడుతుందని ఇటీవలే సీఎన్ బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. భారత్ లో తమ బ్రాండ్ స్టోర్లను తెరుస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు