ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం

21 Apr, 2017 14:41 IST|Sakshi
ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం
బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో సాప్ట్ వేర్ సంస్థల ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారి ఆందోళనకు చెక్ పెడుతూ మరికొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల నియామకంపైన కూడా దృష్టిపెడుతున్నాయి. బహుళ జాతీయ సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ సంస్థలో ఒకటైన ఎస్ఏపీ భారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ దాదాపు 2500 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. బెంగళూరు క్యాంపస్లో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ ఇంజనీర్ల రిక్రూట్ మెంట్ను కంపెనీ చేపట్టబోతుందని పేర్కొన్నాయి.
 
50 మిలియన్ యూరోల పెట్టుబడులతో 5.15 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త సౌకర్యాన్ని కంపెనీ ప్రారంభించింది. గత రెండేళ్లుగా కూడా కంపెనీ మంచి ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది. ప్రతేడాది 1500 మంది ఇంజనీర్లను ఇప్పటికే ఈ కంపెనీ నియమించుకుంది. గత రెండేళ్లుగా తమ నియామకాలు కాలేజీ క్యాంపస్ల ద్వారానే జరిపామని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండెల్వాల్ చెప్పారు. ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియాలో 10వేలకు పైగా ఉద్యోగులున్నారని, వారిలో 7500 మంది ఇంజనీరింగ్ డివిజన్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీకి మొత్తం 85000 మంది ఉద్యోగులున్నారు.
మరిన్ని వార్తలు