మహేశ్వరం వద్ద సరైవాలా రిఫైనరీ

25 Feb, 2016 00:39 IST|Sakshi
మహేశ్వరం వద్ద సరైవాలా రిఫైనరీ

జూన్‌కల్లా ఉత్పత్తి ప్రారంభం
ఖరీదైన బ్లెండెడ్ ఆయిల్స్‌లోకి త్వరలో
కంపెనీ డెరైక్టర్ అంజనీ కుమార్ గుప్తా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేచురల్లే బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న సరైవాలా అగ్రి రిఫైనరీ (ఎస్‌ఏఆర్‌ఎల్) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద రూ.50 కోట్లతో రిఫైనరీ నెలకొల్పుతోంది. రోజుకు 550 టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటులో నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇప్పటికే మహేశ్వరం వద్ద కంపెనీకి రోజుకు 300 టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రిఫైనరీ సామర్థ్యం రోజుకు 700 టన్నులు. ఇప్పుడు సామర్థ్యం తోడవడంతో తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో విస్తరిస్తామని ఎస్‌ఏఆర్‌ఎల్ డెరైక్టర్ అంజనీ కుమార్ గుప్తా బుధవారం తెలిపారు. నేచురల్లే గోల్డ్ ఫెస్ట్ బంపర్ డ్రా విజేతలకు ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మతో కలిసి బహుమతులను ప్రదానం చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గోల్డ్ ఫెస్ట్‌తో అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయని చెప్పారు.

 కొత్త విభాగాల్లోకి..
ప్రీమియం బ్లెండెడ్ ఆయిల్స్‌ను మే నెలలో ప్రవేశపెడతామని అంజనీ కుమార్ గుప్తా వెల్లడించారు. ‘రైస్‌బ్రాన్ విభాగంలోకి కూడా అడుగు పెడతాం. ప్రస్తుతం బియ్యం, రవ్వ విక్రయిస్తున్నాం. ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ విభాగంలో గోధుమ పిండి, పప్పు దినుసుల వంటి ఉత్పత్తులను వీటికి జోడిస్తాం. హైదరాబాద్‌లో నంబర్ వన్, ఏపీ, తెలంగాణలో రెండో స్థానంలో నేచురల్లే ఉంది. నెలకు 13,000 టన్నుల ప్యాక్డ్ ఆయిల్స్ విక్రయిస్తున్నాం. రెండేళ్లలో దీనిని 20,000 టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం’ అని వివరించారు. ఎస్‌ఏఆర్‌ఎల్ 2013-14లో రూ.2,100 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,300 కోట్లు ఆశిస్తోంది. కాగా, భారత పరిశ్రమను ఆదుకోవాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులకు అడ్డుకట్టవేయాలని అన్నారు. ప్రస్తుతమున్న 17.5 శాతం దిగుమతి సుంకాన్ని 27.5కు చేర్చాలని ఆయన కోరారు.

>
మరిన్ని వార్తలు