ప్రపంచ టాప్-10 వేతన సీఈఓల్లో.. మనోళ్లు ఇద్దరు!

29 Apr, 2016 08:04 IST|Sakshi
ప్రపంచ టాప్-10 వేతన సీఈఓల్లో.. మనోళ్లు ఇద్దరు!

ఈక్విలార్ జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్...
టాప్-100లో సత్య నాదెళ్ల


న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పదిమంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి 8వ స్థానంలో, ల్యాండెల్‌బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ ఆరవ స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వందమంది జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్‌లతో పాటు సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. వివరాలు..

రసాయనాల కంపెనీ ల్యాండెల్‌బాసెల్ ఇండస్ట్రీస్ సీఈఓ భవేశ్ వి. పటేల్ 2.45 కోట్ల డాలర్ల వేతనంతో ఆరవ స్థానంలో ఉన్నారు.

2.22 కోట్ల డాలర్ల వేతనంతో పెప్సికో ఇంద్రా నూయికి ఎనిమిదవ స్థానం లభించింది.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 26వ స్థానంలో ఉన్నారు. ఆయన వేతనం 1.83 కోట్ల డాలర్లు.

ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన మార్క్ వి. హర్డ్, సఫ్ర ఏ కాట్జ్‌లు 5.32 కోట్ల డాలర్ల వేతనాలతో మొదటి స్థానంలో నిలిచారు.

వాల్ట్ డిస్ని రాబర్ట్ ఏ ఐగర్ 4.35 కోట్ల డాలర్ల వేతనంతో రెండో స్థానంలో ఉండగా, హనీవెల్ ఇంటర్నేషనల్ సీఈఓ డేవిడ్ ఎం. కోట్ 3.31 కోట్ల డాలర్ల వేతనంతో మూడో స్థానంలో, జనరల్ ఎలక్ట్రిక్ చీఫ్ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్ 2.64 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

గత ఏడాది సీఈఓల సగటు వేతనం 1.45 కోట్ల డాలర్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 3% అధికం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు సగటు వేతనం కంటే తక్కువగానే (1.03 కోట్ల డాలర్లు) లభిస్తోంది. వారెన్ బఫెట్ వేతనం 4.7 లక్షల డాలర్లు మాత్రమే.

ఈ టాప్-100లో 8 మంది మహిళలకు చోటు దక్కింది. అత్యధిక వేతనం అందుకుంటున్న మహిళగా ఒరాకిల్ సీఈఓ కాట్జ్ నిలిచింది.

మరిన్ని వార్తలు