ప్రపంచాన్ని మార్చేవి ఆ మూడే!

8 Nov, 2017 00:29 IST|Sakshi

మిక్స్‌డ్‌ రియాలిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్య  

న్యూఢిల్లీ: మిక్స్‌డ్‌ రియాలిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రానున్న సంవత్సరాల్లో ప్రపంచ రూపు రేఖలను మార్చే టెక్నాలజీలుగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అభివర్ణించారు. మిక్స్‌డ్‌ రియాలిటీని హైబ్రిడ్‌ రియాలిటీగా కూడా చెబుతారు. రియల్, వర్చువల్‌ టెక్నాలజీల కలబోత ఇది. కంప్యూటింగ్‌ ఇప్పటి వరకు మనిషి ఆధారితంగానే మెరుగుపడగా, అంతిమంగా కంప్యూటింగ్‌ అనుభవం మిక్స్‌డ్‌ రియాలిటీగానే ఉండబోతుందన్నారు సత్య నాదెళ్ల.

తన పుస్తకం ‘హిట్‌ రిఫ్రెష్‌’ ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన సత్య.. మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. మాజీ క్రికెటర్‌ అనిల్‌కుంబ్లేతో సమావేశమైన సందర్భంగా ఎన్నో విషయాలపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్‌ హోలోలెన్స్‌ గురించి కూడా ప్రస్తావించారు. విద్యతో పాటు చాలా రంగాల్లో హోలోలెన్స్‌ను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హోలోలెన్స్‌ సాయంతో యూజర్లు వర్చువల్‌ రియాలిటీ భావన పొందుతారు.

తాను సైతం హోలోలెన్స్‌ వాడి చూశానని, అంగారకుడిపై నడిచిన భావన గొప్పగా ఉందని కుంబ్లే తన అనుభవాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘43 ఏళ్ల ప్రయాణంలో మైక్రోసాఫ్ట్‌ ప్రతి ఐదేళ్లకోసారి అస్తిత్వ ముప్పును ఎదుర్కోవడం నేను చూశా. ఏదో ఒక కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ముగింపు పలుకుతుందని కొంత మంది అన్నారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్‌ తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది’’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్‌ మంగళవారం రుహ్‌ అనే చాట్‌బోట్‌ను ప్రదర్శించింది. 

మరిన్ని వార్తలు