చమురు ‘బేజార్‌’

10 Mar, 2020 04:14 IST|Sakshi

ఉత్పత్తి కోతపై దేశాల మధ్య కుదరని సయోధ్య

ధరల పోరుకు తెరతీసిన సౌదీ

30 శాతం పైగా డౌన్‌

1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఇంత భారీ పతనం ఇదే తొలిసారి

సింగపూర్‌:   ముడి చమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్‌ కూటమి, రష్యా మధ్య డీల్‌ కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల పోరుకు తెర తీసింది. భారీగా రేట్లు తగ్గించేసింది. 20 ఏళ్ల కనిష్ట స్థాయికి కోత పెట్టింది. దీంతో సోమవారం చమురు ధరలు ఏకంగా 30 శాతం దాకా పతనమయ్యాయి. ఒక దశలో ప్రామాణిక బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది.  1991 గల్ఫ్‌ యుద్ధ సమయం తర్వాత చమురు రేట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అటు సహజ వాయువు రేట్లు కూడా క్షీణించాయి.  

ఎందుకిలా..
కరోనా వైరస్‌ కారణంగా ముడిచమురుకు డిమాండ్‌ తగ్గి.. మార్కెట్లో క్రూడ్‌ నిల్వలు పెరిగిపోయాయి. ఫలితంగా రేట్లు పడిపోవచ్చన్న భయాలతో సౌదీ అరేబియా సారథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌).. చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని గత వారం జరిగిన సమావేశాల్లో ప్రతిపాదించింది. అయితే, తాము ఉత్పత్తి తగ్గించిన పక్షంలో అమెరికా చమురు ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో దూసుకుపోయే రిస్కులు ఉన్నాయనే ఉద్దేశంతో.. ఈ ప్రతిపాదనను రష్యా విభేదించింది. చమురు ఉత్పత్తిలో సౌదీ, రష్యా.. ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి.

తాజా పరిణామంతో తన మార్కెట్‌ వాటాను కాపాడుకునే దిశగా.. అదే సమయంలో రష్యాపై ఒత్తిడిని పెంచే దిశగా సౌదీ అరేబియా పావులు కదిపింది. చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా .. క్రూడాయిల్‌ రేట్లను తగ్గించడంతో పాటు ఉత్పత్తినీ పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌లో కాంట్రాక్టుకు సంబంధించిన రేట్లను బ్యారెల్‌కు 6 నుంచి 8 డాలర్ల దాకా తగ్గించేసింది. ఇది మార్కెట్లో కలకలం రేపడంతో క్రూడాయిల్‌ రేట్లు భారీగా పతనమయ్యాయి. చమురు ధరలు దాదాపు దశాబ్దపు కనిష్ట స్థాయి 26 డాలర్లకు దగ్గర్లో ఉండటం మార్కెట్‌ వర్గాలను కలవరపెడుతోంది. త్వరలోనే ఈ స్థాయిని కూడా తాకవచ్చని ఆంచనాలు ఉన్నాయి.  

20 డాలర్లకూ పతనావకాశం..
ఒకవేళ ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోతే చమురు రేట్లు బ్యారెల్‌కు ఏకంగా 20 డాలర్ల స్థాయికి కూడా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. రష్యాను చర్చలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగానే సౌదీ అరేబియా ఈ వ్యూహాలు అమలు చేస్తుండవచ్చని వారు పేర్కొన్నారు. ఒకవేళ రేట్లు గానీ భారీగా పతనమైతే .. చమురు ఆదాయాలపై ఆధారపడిన దేశాలు దెబ్బతినడంతో పాటు క్రూడాయిల్‌ అన్వేషణ ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.  

మరిన్ని వార్తలు