రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

12 Aug, 2019 13:24 IST|Sakshi

ముంబై : భారత్‌లో అతిపెద్ద ఎఫ్‌డీఐగా రిలయన్స్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ - సౌదీ ఆరామ్కో ఒప్పందం నిలవనుంది. రిలయన్స్‌ రిఫైనరీ, కెమికల్‌ వ్యాపారంలో సౌదీ చమురు దిగ్గజం ఆరామ్కో రూ 5,32,466 కోట్ల మొత్తంతో 20 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని ఆర్‌ఐఎల్‌ చీఫ్‌ ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. ఆర్‌ఐఎల్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండు రిలయన్స్‌ రిఫైనరీలకు ఆరామ్కో రోజుకు 50,000 బ్యారెళ్ల ముడిచమురును సరఫరా చేస్తుందని చెప్పారు.

ప్రపంచంలోని దిగ్గజ వాణిజ్య సంస్థల్లో ఒకటైన సౌదీ ఆరామ్కోను తమ సంస్ధలో కీలక ఇన్వెస్టర్‌గా స్వాగతిస్తున్నామని చెప్పారు. సౌదీ ఆరామ్కోతో తమకు పాతికేళ్లుగా ముడిచమురు రంగంలో అనుబంధం ఉందంటూ ఈ పెట్టుబడులతో తమ బంధం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. భారత నియంత్రణ సంస్థలు, ఇతర అనుమతులు, నిబంధనలకు లోబడి వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి ఒప్పందం కార్యరూపం దాల్చుతుందని వెల్లడించారు.

మరోవైపు సౌదీ ఆయిల్‌ కంపెనీ ఆరామ్కో దుబాయ్‌కు చెందిన అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ)తో కలిసి మహారాష్ట్రలో పీఎస్‌యూ ఆయిల్‌ కంపెనీలు ఏర్పాటు చేసే మెగా రిఫైనరీ కమ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో 50 శాతం వాటా తీసుకునేందుకు అంగీకరించాయి. భారత ఇంధన రంగంలో అపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సౌదీ ఆయిల్‌ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

మరిన్ని వార్తలు