పైసా పైసా.. అదే వీటి స్పెషల్!

14 Sep, 2015 00:57 IST|Sakshi
పైసా పైసా.. అదే వీటి స్పెషల్!

- డిపాజిట్లు, డెట్ ఫండ్స్ కంటే మెరుగైన రాబడి
- ఎగుడు దిగుడు మార్కెట్లో ఇంకాస్త అధికం
- పన్ను ప్రయోజనాలు కూడా అధికమే
- స్వల్పకాలిక ఇన్వెస్టర్లకి ఆర్బిట్రేజ్ ఫండ్లే ప్రత్యామ్నాయం

ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫండ్లు నష్టాలనందించటమనేది ఎక్కడో తప్ప జరగదు. మార్కెట్లు పడుతున్నా, పెరుగుతున్నా వీటి పనితీరు భిన్నంగా ఉంటుంది కనక ఇవి లాభాలార్జించడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాకపోతే మరీ ఈక్విటీ ఫండ్లలా మార్కెట్లు బాగున్నపుడు ఏడాదిలో 30 శాతం లాభాలివ్వటం... బాగులేనపుడు 30 శాతం నష్టాలివ్వటమనేది వీటిలో జరగదు. వీటిలో లాభాలొచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి పరిమితంగానే ఉంటాయి. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ ఉంటాయనేది మాత్రం చెప్పొచ్చు. అందుకే... ఈ ఒడిదుడుకుల మార్కెట్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది కేవలం రూ.13,885 కోట్లుగా ఉన్న ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఇప్పుడు రూ.27,000 కోట్లు దాటింది. అంటే దాదాపు రెట్టింపయింది. దీన్నిబట్టే వీటికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ ఫండ్స్‌పై అవగాహన కల్పించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం..
 
ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొత్తవేమీ కావు. ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నవే. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలైతే అచ్చంగా ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాయి కూడా. కాకపోతే వీటిపై రిటైల్ ఇన్వెస్టర్లకు అవగాహన మాత్రం తక్కువే ఉంది. గతేడాది డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజనాలను తగ్గించడం... వడ్డీరేట్లు కూడా తగ్గటంతో ఇన్వెస్టర్లు ఆర్బిట్రేజ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ పథకాల కేసి చూస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండే ఈ ఫండ్లు... చాలా సందర్భాల్లో బ్యాంకు డిపాజిట్ల కంటే రెండుమూడు శాతం అధిక రాబడినే అందిస్తున్నాయి. ఇక బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను భారం వీటిలో తక్కువ. ఈ ఆకర్షణలే వీటివైపు రిటైలర్లు మొగ్గేలా చేస్తున్నాయిపుడు.
 
ఎవరికి అనుకూలం..
స్వల్పకాలంలో బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి ఇవి అనుకూలమైనవని చెప్పొచ్చు. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల కాలపరిమితిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పన్ను ప్రయోజనాల కోసమైతే 12 నెలల వరకు వేచి చూడొచ్చు. అంతేకాని వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణించకూడదు.

మరిన్ని వార్తలు