మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్‌బీఐ టాప్

19 Sep, 2014 01:42 IST|Sakshi
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్‌బీఐ టాప్

విలువపరంగా అగ్రస్థానంలో ఐసీఐసీఐ
ముంబై: మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)దే అగ్రస్థానం. విలువ పరంగా చూస్తే ఐసీఐసీఐ మొదటి స్థానంలో ఉంది. భవిష్యత్తులో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జోరుగా ఉంటాయని నిపుణులంటున్నారు. జూన్‌లో జరిగిన మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది.
 
ఎస్‌బీఐ వాటా 50 శాతం
మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటా 50 శాతం వరకూ ఉందని  ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. తమ మొత్తం రిటైల్ ఖాతాదారుల్లో 4.5 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్ యూజర్లున్నారని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి 1.15 కోట్ల మంది నమోదైన యూజర్లున్నారని వివరించారు. రెండేళ్లలో ఈ సంఖ్య 10-12 శాతానికి, ఐదేళ్లలో 30-35 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నాయన్నారు. ఇటీవలనే మెస్సేజ్-బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభమయ్యాయని, ప్రజలకు ఇది పూర్తిగా అర్థమైన పక్షంలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో విప్లవం సంభవిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.  జూన్‌లో జరిగిన మొత్తం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో తమవే అధికమని భట్టాచార్య వివరించారు.
 
రూ.1,000 కోట్లు దాటిన ఐసీఐసీఐ
జూన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ మొత్తం  రూ.1,000 కోట్లను దాటింది. ఒక నెలలో రూ.1,000 కోట్లకు పైబడిన మొబైల్ లావాదేవీలు నిర్వహించిన తొలి బ్యాంక్ తమదేనని ఐసీఐసీఐ పేర్కొంది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారుల్లో ఐదో వంతు మంది వినియోగదారులతోనే తాము ఈ ఘనతను సాధించామని వివరించింది. దాదాపు 20 లక్షల మంది ఐసీఐసీఐ యాక్టివ్ మొబైల్ యూజర్లున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు