ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో సమ్మె విజయవంతం

21 May, 2016 02:19 IST|Sakshi
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో సమ్మె విజయవంతం

మాతృసంస్థలో విలీన ప్రతిపాదనకు నిరసన
జూన్ 7, జూలై 28న కూడా సమ్మె ప్రకటన
జూలై 29న పూర్తి బ్యాంకింగ్ సమ్మె

 ముంబై: మాతృసంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో విలీన ప్రతిపాదనను నిరసిస్తూ... శుక్రవారం దేశ వ్యాప్తంగా సంబంధిత ఐదు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. దాదాపు 50,000 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రానున్న నెలల్లో మరిన్ని ఆందోళనలు తప్పవనీ ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా హెచ్చరించాయి. ఇందులో భాగంగా జూన్ 7, జూలై 28వ తేదీలు కూడా ఉద్యోగులు సమ్మె చేస్తారని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ విశ్వాస్ ఉద్ఘీ పేర్కొన్నారు. ఎస్‌బీఐ యాజమాన్య అహంకార, పెద్దన్న, పక్షపాత ధోరణిని కూడా తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం తరహాలోనే జూన్ 7, జూలై 28వ తేదీల్లో ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె జరుపుతారని, అటు తర్వాత జూలై 29న బ్యాంకింగ్ పరిశ్రమ మొత్తం సమ్మె చేస్తుందని పేర్కొన్నారు. ఈ బలవంతపు విలీన ప్రతిపాదనను ఇతర ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. ఈ తరహా వైఖరిని వాణిజ్య సంఘాలతో పాటు, అన్ని రాజకీయ పార్టీలు సైతం వ్యతిరేకించాలని కోరారు. ఐదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్; హైదరాబాద్; మైసూర్; పాటియాలా; ట్రావెన్‌కోర్‌లు ఉన్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 67,000 బ్రాంచ్‌లు, 9,000 ఏటీఎంలు ఉన్నాయి. మార్చి నాటికి ఈ బ్యాంకుల వ్యాపారం మొత్తం రూ.9,00,000 కోట్లు. నిర్వహణా లాభం రూ.10,500 కోట్లు.

 విలీన వ్యయం రూ.1,660 కోట్లు: మూడీస్
ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులుసహా భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) విలీన ప్రక్రియకు దాదాపు రూ.1,660 కోట్ల వ్యయమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేసింది.  ఎస్‌బీఐ రుణ సంబంధ అంశాలపై సైతం ఈ విలీన ప్రక్రియ పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడింది.  తన సొంత నిధులనే ఎస్‌బీఐ దీనికి వినియోగించే వీలుందని కూడా అంచనావేసింది.  మరోవైపు, బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం పెద్దగా ఏమీ పడలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని శాఖలు తెరిచే ఉంచామని, నగదు లావాదేవీలు మినహా మిగతా అన్ని బ్యాంకింగ్ సేవలు అందించినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు