ఇకపై ఎస్‌బీఐ లావాదేవీలపై చార్జీల మోతే

1 Jun, 2017 14:51 IST|Sakshi
ఇకపై ఎస్‌బీఐ లావాదేవీలపై చార్జీల మోతే

న్యూఢిల్లీ:  దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి(జూన్ 1) నుంచి అమలు చేయనుంది.  ఎటీంఎం, ఆన్‌లైన్ క్యాస్‌ ట్రాన్సాక్షన్లపై బాదుడు షురూ అయినట్టే. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో  ఇకనుంచి నగదు ఉపసంహరణ, చెల్లింపులపై ఇక చార్జీల మోత మోగనుంది.

ఇటీవల సవరించిన ఎస్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును  వసూలు చేయనుంది. ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది.

ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై  ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి.   నాన్‌ మెట్రో, మెట్రో నగరాల్లో 10 లావాదేవీలు ఉచితం. ఈ   ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50  వసూలు చేస్తుంది. దీంతోపాటు నెలకు రూ.50 వేలకు మించి చెల్లింపులు జరిపే వారి నుంచి 5 శాతం టీడీఎస్‌ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే.

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఐఎంపీఎస్‌, యూపీఐ, ఐయూఎస్ఎస్‌డీల ద్వారా రూ.లక్ష వరకు లావాదేవీలపై సేవా పన్ను కాక అదనంగా రూ.5 చెల్లించాల్సిందే. రూ. లక్ష నుంచి 2 లక్షల మధ్య లావాదేవీలపై రూ.15, రూ.2 లక్షల నుంచి 5లక్షల లావాదేవీలపై రూ.25 అదనంగా వడ్డించనుంది.

మరోవైపు చిరిగిన నోట్ల మార్పిడిపై కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేయనున్నాయి. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది.
 

మరిన్ని వార్తలు