ఎస్‌బీఐ మళ్లీ లాభాల బాట

6 Nov, 2018 01:43 IST|Sakshi

వరుసగా మూడు క్వార్టర్ల నష్టాలకు అడ్డుకట్ట...

క్యూ2లో రూ. 945 కోట్ల నికర లాభం...

మార్చి క్వార్టర్‌లో రూ.4,876 కోట్ల నికర నష్టం

గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌తో పోలిస్తే లాభం 40 శాతం తగ్గుదల

ఆదుకున్న భారీ వన్‌టైమ్‌ రాబడులు; మొండిబకాయిలు తగ్గుముఖం...

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్‌ అగ్రగామి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మొండిబకాయిల సమస్య నుంచి నెమ్మదిగా మళ్లీ గాడిలో పడుతోంది. గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలను ప్రకటిస్తున్న బ్యాంక్‌ ఇప్పుడు లాభాల బాటపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018–19, క్యూ2) స్టాండెలోన్‌ ప్రాతిపదికన (బ్యాంకింగ్‌ కార్యకలాపాలు) రూ.945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

కిందటేడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.1,582 కోట్లతో పోలిస్తే 40% తగ్గింది. అయితే, ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌లో (క్యూ1) వచ్చిన రూ.4,876 కోట్ల భారీ నష్టంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా బ్యాంక్‌ మళ్లీ లాభాల్లోకి రావడం గమనార్హం.  మార్చి క్వార్టర్‌లో కూడా రూ.7,718 కోట్ల నికర నష్టాన్ని ఎస్‌బీఐ మూటగట్టుకోవడం తెలిసిందే. మరోపక్క, సెప్టెంబర్‌ క్వార్టర్‌లో(క్యూ2) అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చిన రూ.5,436 కోట్ల భారీ వన్‌టైమ్‌ ఆదాయం ఎస్‌బీఐకి కలిసొచ్చింది. 

మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, కేటాయింపుల(ప్రొవిజనింగ్‌) భారం శాంతించడం కూడా బ్యాంక్‌ మెరుగైన పనితీరుకు తోడ్పడింది. క్యూ2లో ఎస్‌బీఐ రూ.225 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. బ్యాంక్‌ స్టాండెలోన్‌ ఆదాయం రూ.65,429 కోట్ల నుంచి స్వల్ప పెరుగుదలతో రూ.66,608 కోట్లకు చేరింది. 1.8% వృద్ధి నమోదైంది.

కన్సాలిడేటెడ్‌గా ఇలా...
ఎస్‌బీఐ లైఫ్, జనరల్‌ ఇన్సూరెన్స్, కార్డ్స్, మ్యూచువల్‌ ఫండ్‌... ఈ అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎస్‌బీఐ క్యూ2లో రూ.576 నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన లాభం రూ.1,841 కోట్లతో పోలిస్తే 69 శాతం తగ్గింది.  మొత్తం ఆదాయం మాత్రం 5.8 % వృద్ధితో రూ.74,949 కోట్ల నుంచి రూ.79,303 కోట్లకు పెరిగింది.

మొండిబకాయిలు తగ్గాయ్‌...
బ్యాంక్‌ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు క్యూ2లో రూ.2,05,864 కోట్లుగా (9.95 శాతం) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో స్థూల ఎన్‌పీఏలు రూ.1,86,115 కోట్లుగా (9.83 శాతం) ఉన్నాయి. అయితే ఈ ఏడాది క్యూ1లో రూ. 2,12,840 కోట్లుతో (10.69%) పోలిస్తే సీక్వెన్షియల్‌గా దిగొచ్చాయి. ఇక నికర ఎన్‌పీఏలు వార్షిక ప్రాతిపదికన, సీక్వెన్షియల్‌గా కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.

గతేడాది క్యూ2లో రూ.97,896 కోట్లుగా(5.43%) ఉన్న నికర ఎన్‌పీఏలు ఈ ఏడాది క్యూ2లో రూ.94,810 కోట్లకు (4.84%) తగ్గాయి. ఈ ఏడాది క్యూ1లో ఇవి రూ. 99,236 కోట్లుగా (5.29%) ఉన్నాయి. మరోపక్క, మొండిబాకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) కూడా భారీగా తగ్గాయి. గతేడాది క్యూ2లో రూ.16,842 కోట్లను కేటాయించగా... ఈ ఏడాది క్యూ2లో 39% తగ్గుదలతో ప్రొవిజనింగ్‌ రూ.10,381 కోట్లకు దిగి వచ్చింది.

కాగా, క్యూ2లో స్థూలంగా రూ.10,888 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో మొండి బకాయిలుగా మారిన రూ.14,349 కోట్లతో పోలిస్తే భారీగా అడ్డుకట్టపడినట్లు లెక్క. రైటాఫ్‌ చేసిన రుణ ఖాతాల్లో సుమారు రూ. 1,327 కోట్లను రికవరీ చేసుకున్నామని.. 14.6% వృద్ధి నమోదయిందని బ్యాంక్‌ వెల్లడించింది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) క్యూ2లో 12.5 శాతం వృద్ధి చెంది రూ.18,586 కోట్ల నుంచి రూ.20,906 కోట్లకు ఎగబాకింది.
n నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.59 శాతం నుంచి 2.88 శాతానికి మెరుగుపడింది.
బ్యాంక్‌ మొత్తం రుణాలు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 9 శాతం వృద్ధితో రూ.19.57 లక్షల కోట్లకు చేరాయి. దేశీ రుణ వృద్ధి 1%గా నమోదైంది. ఇందులో కార్పొరేట్, రిటైల్‌ రుణాలు 14% వృద్ధి చెందాయి.
డిపాజిట్లు 7 శాతం పెరుగుదలతో రూ.28.07 లక్షల కోట్లకు చేరాయి.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం ఎస్‌బీఐ షేరు పరుగులు తీసింది. ట్రేడింగ్‌ మరో పావు గంటలో ముగుస్తుందనగా.. ఫలితాలు వెలువడ్డాయి. దీంతో బీఎస్‌ఈలో 5 శాతం దూసుకెళ్లి రూ.299.90ని తాకింది. చివరకు 3.45 శాతం లాభంతో రూ.295 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.8,791 కోట్లు ఎగబాకి రూ. 2,63,543 కోట్లకు చేరింది. సెస్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రూ.4,250 కోట్ల రుణాలు...
రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌స్‌ గ్రూప్‌ మొత్తానికి తాము దాదాపు రూ.4,250 కోట్ల మేర రుణాలిచ్చినట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందులో రూ.4,000 కోట్లు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన 13– 14 ప్రత్యేక సంస్థలకు (ఎస్‌పీవీ) ఇవ్వగా... మరో రూ.250 కోట్లను మాతృ సంస్థ అయిన హోల్డింగ్‌ కంపెనీకి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఒక్క ఖాతా మాత్రమే మొండిబకాయిగా మారిందని.. దీనికి రూ.56 కోట్ల కేటాయింపులు జరిపామని రజనీష్‌ పేర్కొన్నారు.

కాగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) తామిచ్చిన రుణాల పరిమాణం రూ.1.5 లక్షల కోట్లు ఉన్నట్లు వివరించారు. ‘ఈ రుణాలకు సంబంధించి వ్యవస్థాగత రిస్కులేవీ లేవు. సంక్షోభం మొదలైన ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. అక్టోబర్‌ నెలలో సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఎన్‌బీఎఫ్‌సీ రుణాలను టేకోవర్‌ చేశాం. మరో రూ.15,940 కోట్ల రుణాలను చేజిక్కించుకునే పనిలో ఉన్నాం. మార్చి నాటికి రూ.45,000 కోట్ల రుణాలు, ఆస్తుల కొనుగోలు లక్ష్యాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉంది’ అని ఎస్‌బీఐ చైర్మన్‌ పేర్కొన్నారు.


క్యూ2లో నికర లాభం తక్కువగానే ఉన్నప్పటికీ... బ్యాంక్‌ పనితీరు బాగా మెరుగుపడింది. రానున్న కాలంలో లాభాలు మరింత పుంజుకుంటాయన్న విశ్వాసం ఉంది. మొండిబకాయిలు, కేటాయింపులు కూడా భారీగానే దిగొస్తాయని భావిస్తున్నాం. – రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా