30 తరవాత... ఆ చెక్కులు చెల్లవు!

22 Sep, 2017 18:31 IST|Sakshi
30 తరవాత... ఆ చెక్కులు చెల్లవు!

► అనుబంధ బ్యాంకుల చెక్కులపై ఎస్‌బీఐ స్పష్టీకరణ
► ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కూడా మార్చుకోవాలని వెల్లడి
► చెక్కులే హామీగా... రుణాలిచ్చిన వారిలో ఆందోళన  

సాక్షి, అమరావతి: స్నేహితుడు శ్రీధర్‌ రికమెండ్‌ చేయటంతో వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో రమేశ్‌కు రూ.2 లక్షలు అప్పిచ్చాడు వెంకట్‌. దానికి హామీగా రమేశ్‌ పోస్ట్‌డేటెడ్‌ చెక్కులిచ్చాడు. ప్రతినెలా వడ్డీ కోసం ఆ చెక్కులు బ్యాంకులో వేసుకోవచ్చు. రెండేళ్ల తరవాత అసలు మొత్తాన్ని చెల్లిస్తానంటూ దానిక్కూడా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చాడు రమేశ్‌.

కాకపోతే రమేశ్‌ది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఖాతా. ఆ బ్యాంకు ఇప్పుడు ఎస్‌బీఐలో విలీనమైపోయింది. రమేశ్‌ ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిపోయాయి. మరి పాత చెక్కులు చెల్లవు కదా!!. వెంకట్‌ ఏం చేయాలి? ఇదిప్పుడు వెంకట్‌ ఒక్కడి సమస్య మాత్రమే కాదు. రుణాలిచ్చి, ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల తాలూకు పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు తీసుకున్న అందరిదీ!!. ఎస్‌బీఐ కూడా... ఇప్పటిదాకా ఈ చెక్కుల్ని తీసుకున్నా... ఈ నెల 30 తరవాత మాత్రం అనుమతించబోమని కరాఖండిగా చెప్పేసింది. అదీ విషయం.

భారతీయ మహిళా బ్యాంకుతో సహా ఎస్‌బీహెచ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ తదితర అనుబంధ బ్యాంకులు జారీచేసిన చెక్కులేవీ సెప్టెంబర్‌ 30 తర్వాత చెల్లబోవని, పాత చెక్కుల స్థానంలో కొత్తవాటిని తీసుకోవాల్సిందేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు స్పష్టంచేసింది. ఎస్‌బీఐలో విలీనమైన 6 బ్యాంకులకు చెందిన పాత చెక్‌ బుక్కులు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు సెప్టెంబర్‌ 30 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, కొత్త చెక్‌బుక్స్‌ను మాత్రమే అనుమతిస్తామని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

ఈ ఏడాది మే 27న ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనూర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ విలీనమైన సంగతి తెలిసిందే. ఈ విలీనం రోజు నుంచే ఈ బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారినప్పటికీ ఇప్పటి వరకు పాత నంబర్లను కూడా అనుమతించేవారు. ఇప్పుడేమో తాజా ప్రకటన చేశారు.

అప్పులిచ్చిన వారిలో ఆందోళన...
అప్పులు ఇచ్చిన వారు హామీ కోసం పోస్ట్‌డేటెడ్‌ చెక్‌లు తీసుకోవటమనేది సర్వ సాధారణం. సెప్టెంబర్‌ 30 నుంచి విలీన బ్యాంకుల చెక్కులు పనిచేయవని ఎస్‌బీఐ ప్రకటించడంతో ఆ బ్యాంకు చెక్కులు తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవడం చాలా కష్టమవుతోందని, ఇలాంటి తరుణంలో పాత చెక్కులు కూడా రద్దు అవుతుండటంతో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని కొందరు ఆందోళన వ్యక్తంచేశారు.

నాలుగు నెలలుగా తన ఖాతాదారుడొకరు తీసుకున్న అప్పు చెల్లించడం లేదని, ఇప్పుడు కొత్త చెక్‌ అడిగితే ఫోన్‌ నంబరే మార్చేశాడని, దీంతో ఇప్పుడు రావాల్సిన బకాయిని రాసి పాత చెక్కును బ్యాంకులో వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని స్థానిక వడ్డీ వ్యాపారి ఒకరు వాపోయారు. ఈయనే కాదు. చాలామంది వడ్డీ వ్యాపారులదిప్పుడు అదే పరిస్థితి.

మరిన్ని వార్తలు