Q1 ఎఫెక్ట్‌- ఎస్‌బీఐ కార్డ్స్‌ జూమ్‌

21 Jul, 2020 10:45 IST|Sakshi

నికర లాభం 14 శాతం అప్‌

6 శాతం జంప్‌ చేసిన ఎస్‌బీఐ కార్డ్స్‌

సరికొత్త గరిష్టానికి చేరిన షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 797కు చేరింది. వెరసి ఈ ఏడాది మార్చి 16న లిస్టయ్యాక రికార్డ్‌ గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 790 వద్ద ట్రేడవుతోంది. 

రూ. 393 కోట్లు
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఎస్‌బీఐ కార్డ్స్‌ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 393 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 52 శాతం ఎగసి రూ. 1138 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.68 శాతం నుంచి 1.35 శాతానికి భారీగా తగ్గాయి. త్రైమాసిక ప్రాతిపదికన సైతం 2 శాతం నుంచి దిగివచ్చాయి. కాగా.. నికర ఎన్‌పీఏలు 1.3 శాతం వెనకడుగుతో 1.35 శాతంగా నమోదయ్యాయి. ఇందుకు మారటోరియం కారణమైనట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తిఏడాదికి(2021) నికర ఎన్‌పీఏలు 4.5 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్‌ వ్యయాలు 6.3 శాతానికి చేరవచ్చని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు