మార్చి 2 నుంచి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

21 Feb, 2020 04:58 IST|Sakshi

ఇష్యూ సైజు రూ.9,000 కోట్లు 

ప్రైస్‌ బాండ్‌ రూ.750–755 ! 

వచ్చే నెల 16న లిస్టింగ్‌ !  

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ల  విభాగం, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చే నెల 2 నుంచి ఆరంభం అవుతుంది. అదే నెల 5న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. దీంట్లో ఎస్‌బీఐ 3.7 కోట్లు, కార్లైల్‌ గ్రూప్‌ 9.3 కోట్ల షేర్లను విక్రయిస్తాయి.   మార్కెట్‌ లాట్‌గా 19 షేర్లను నిర్ణయించారు. ఈ ఐపీఓకు ప్రైస్‌ బాండ్‌ రూ.750–755గా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్‌బీఐ ఉద్యోగులకు 15 శాతం డిస్కౌంట్‌  లభిస్తుంది.  

జీఎమ్‌పీ రూ.320–330  
వచ్చే నెల 16న ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జీఎమ్‌పీ (గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌) రూ.320–330 రేంజ్‌లో ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా  క్యాపిటల్, యాక్సిస్‌ క్యాపిటల్, డీఎస్‌పీ మెరిల్‌ లించ్, నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌  వ్యవహరిస్తున్నాయి.

ఎస్‌బీఐ కార్డ్స్‌ కంపెనీలో ఎస్‌బీఐకు 76 శాతం, కార్లైల్‌ గ్రూప్‌నకు 24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన షేర్లను కార్లైల్‌ గ్రూప్, 4 శాతం వాటాకు సమానమైన షేర్లను ఎస్‌బీఐ విక్రయిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన రెండో అతి పెద్ద కంపెనీగా  ఎస్‌బీఐ కార్డ్స్‌ నిలిచింది. మన దేశ క్రెడిట్‌ కార్డ్‌ల మార్కెట్లో ఈ కంపెనీ వాటా 18 శాతం.  ఈ కంపెనీ వినియోగదారులు 90 లక్షలకు పైగా ఉన్నారు.   ఈ కంపెనీ ఐపీఓ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఈ కంపెనీ అత్యధిక వాటా ఉన్న ఎస్‌బీఐ షేర్‌ లాభపడింది. బీఎస్‌ఈలో 2.3 శాతం లాభంతో రూ.328 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు