అరుంధతీ భట్టాచార్య.. ద లీడర్‌

24 Mar, 2017 00:46 IST|Sakshi
అరుంధతీ భట్టాచార్య.. ద లీడర్‌

ఫార్చ్యూన్‌ టాప్‌–50లో స్థానం
న్యూయార్క్‌: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్యకు అరుదైన గౌవరం లభించింది. ఫార్చ్యూన్‌ ‘ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల’ జాబితాలో ఈమె 26వ స్థానంలో నిలిచారు. ఈమెతో పాటు భారతీయ సంతతికి చెందిన లాస్ట్‌మైల్‌హెల్త్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్‌ పంజాబి కూడా జాబితాలో ఉన్నారు. ఈయన 28వ స్థానంలో నిలిచారు. ఇక జాబితాలో షికాగో కబ్స్‌ బేస్‌బాల్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌ థియో ఎప్‌స్టీన్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన తర్వాతి స్థానంలో వరుసగా అలీబాబా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జాక్‌ మా.. పోప్‌ ఫ్రాన్సిస్‌.. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కొ–చైర్మన్‌ మిలిందా గేట్స్‌..

అమెజాన్‌ ఫౌండర్, సీఈవో జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఎస్‌బీఐకు సంబంధించి డీమోనిటైజేషన్, మొండిబకాయిలు వంటి పలు సమస్యలను ఎదుర్కోవడంలో భట్టాచార్య కీలకపాత్ర పోషించారని ఫార్చ్యూన్‌ పేర్కొంది. బ్యాంక్‌ను డిజిటలైజేషన్‌ దిశగా నడిపిస్తున్నారని కితాబునిచ్చింది. ఇక నాన్‌–ఫ్రాఫిట్‌ సంస్థ అయిన లాస్ట్‌మైల్‌హెల్త్‌ 2014లో లైబీరియాలో ఎబోలా వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసిందని పేర్కొంది. కాగా జాబితాలో జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్, ఫెడరల్‌ రిజర్వు చీఫ్‌ జానెట్‌ యెలెన్‌ వంటి పలువురు ప్రముఖులు స్థానం పొందారు. 

మరిన్ని వార్తలు