యథాతథంగా రేటు బదలాయించలేం!

4 Dec, 2015 03:27 IST|Sakshi
యథాతథంగా రేటు బదలాయించలేం!

 ‘రెపో’పై ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
  డిపాజిట్ల వ్యవస్థ అందుకు వీలుకల్పించదని విశ్లేషణ
 కోల్‌కతా:
భారత్‌లో రిజర్వుబ్యాంక్ ఉపయోగించే రెపో రేటు సాధనాన్ని పటిష్టవంతంగా అమలుచేయడం సాధ్యం కాదని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం ఇక్కడ ఒక కార్యక్రమంలో  పేర్కొన్నారు. రెపో రేటుకు అనుగుణంగా తమ రుణ రేట్లను బ్యాంకులు సర్దుబాటు చేయలేవని ఎస్‌బీఐ చీఫ్ పేర్కొన్నారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ఈ ఏడాది ఈ రేటును ఆర్‌బీఐ 1.25% తగ్గించింది.  దీనితో ఈ రేటు 6.75%కి తగ్గింది. తాను రెపో రేటును 1.25% తగ్గించినప్పటికీ, బ్యాంకులు దాదాపు 0.70% వరకూ తమ రుణ రేటును తగ్గించాయని, తన నుంచి అందిన ‘రుణ రేటు’ ప్రయోజనాన్ని పూర్తిగా బ్యాంకింగ్ బదలాయించడం లేదని ఆర్‌బీఐ పదేపదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య ఈ వ్యాఖ్య చేశారు.

 కారణం ఏమిటంటే...!
 భారత్ బ్యాంకులు ప్రధానంగా ఆధారపడేది డిపాజిట్లపైనేనని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తమ నిధులకు మార్కెట్ రుణాలపై బ్యాంకులు ఆధారపడవన్నది గుర్తించాలని,  ఇలాంటి పరిస్థితుల్లో రెపో రేటు యథాతథంగా బ్యాంకింగ్ అమలు చేయలేదని వివరించారు. ఎస్‌బీఐ నిధులకు సంబంధించి 97 శాతం ఆధారపడేది డిపాజిట్లపైనేని ఆమె ఈ సందర్భంగా పేర్కొంటూ... ఈ పరిస్థితుల్లో బ్యాంక్ వ్యయ భారాన్ని తగ్గించుకోడానికి రెపో రేటులో మార్పు ఎంతమాత్రం దోహదపడదని తెలిపారు. విదేశీ బ్యాంకులు తమ నిధులకు దాదాపు 30 నుంచి 40 శాతం మార్కెట్ రుణాలపై ఆధారపడతాయని ఆమె వివరిస్తూ... అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రెపో రేటును తక్షణం యథాతథంగా అమలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు.

2013లో ఆర్‌బీఐ రెపో రేటును 3 శాతం పెంచిందని ఆమె పేర్కొంటూ... ఆ మేరకు బ్యాంకులు తమ రుణ రేటు పెంచలేదని వివరించారు. కాగా మార్జినల్ కాస్ట్ ఆధారిత బేస్ రేటుపై ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను ఆమె ప్రస్తావిస్తూ, బాగా ఆలోచించే వీటిని రూపొందిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మార్గదర్శకాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అవి వెలువడిన తర్వాతే వ్యాఖ్యానించగలనని పేర్కొన్నారు. కాగా ముసాయిదా మార్గదర్శకాలు ఆచరణయోగ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు