పంట రుణాల మాఫీ సరికాదు

15 Mar, 2017 23:51 IST|Sakshi
పంట రుణాల మాఫీ సరికాదు

రుణాల చెల్లింపు తీరును దెబ్బతీస్తుంది
భవిష్యత్తులోనూ ఇదే ఆశిస్తారు
దీనివల్ల భవిష్యత్తులో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించరు
ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య
ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడాలని సూచన


ముంబై: రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదని ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ హామీని బీజేపీ ఇచ్చిన నేపథ్యంలో అరుంధతీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘‘రుణాలను మాఫీ చేస్తే రుణాలు తిరిగి చెల్లించే అలవాటు తగ్గుతుంది. ఎందుకంటే రుణ మాఫీ పొందిన వారు భవిష్యత్తులోనూ రుణాల మాఫీపై ఆశలు పెట్టుకుంటారు. దాంతో భవిష్యత్తులో ఇచ్చే రుణాల చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ రోజు ప్రభుత్వం చెలిస్తుంది గనుక రుణాలు వసూలు అవుతాయి. రైతులకు తిరిగి రుణాలు ఇస్తే వారు మరోసారి రుణ మాఫీ కోసం వచ్చే ఎన్నికల వరకు తీర్చకుండా ఉంటారు’’ అని ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా భట్టాచార్య పేర్కొన్నారు.

ఎస్‌బీఐ–క్రెడాయ్‌ భాగస్వామ్యం
రియల్టీ రంగ అభివృద్ధి కోసం కలసి పనిచేయాలని ప్రభుత్వరంగ ఎస్‌బీఐ, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల సంఘం క్రెడాయ్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) వచ్చాయి. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అందరికీ ఇళ్లు వంటి పలు విభాగాల్లో  పరస్పర సహకారానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని, ఇది రియల్టీ రంగానికి కూడా మేలు చేస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా ఎస్‌బీఐ, క్రెడాయ్‌ సంయుక్తంగా సమావేశాలు, సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నాయి.