ఆ 12 కంపెనీలు...మా లాభాలను దెబ్బతీయలేవు!

28 Jun, 2017 01:11 IST|Sakshi
ఆ 12 కంపెనీలు...మా లాభాలను దెబ్బతీయలేవు!

ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య
తగిన ప్రొవిజనింగ్స్‌ జరిగాయని వివరణ


ముంబై: మొండిబకాయిలకు సంబంధించి అధిక వాటా కలిగిన 12 సంస్థల అకౌంట్లు బ్యాంకుల నికర లాభాలపై ప్రభావం చూపుతాయని వస్తున్న విశ్లేషణలను బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య తోసిపుచ్చారు. దివాలా ప్రొసీడింగ్స్‌కు రిఫర్‌ చేసిన ఆయా అకౌంట్ల మొండిబకాయిల విషయంలో దాదాపు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్‌) ఇప్పటికే జరిగిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో  ‘భారీగా అదనపు ప్రొవిజనింగ్‌’ అనే మాటే తలెత్తబోదని అన్నారు. ఇక్కడ జరిగిన వార్షిక సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, సంబంధిత అకౌంట్లకు సంబంధించి ఏదో కొద్ది మొత్తం ప్రొవిజనింగ్స్‌ జరపాల్సి వస్తుంది తప్ప,  ఈ మొత్తం భారీగా ఉండబోదని అన్నారు.

12 అకౌంట్లకు భారీ కేటాయింపులు జరపాల్సి రావడం బ్యాంకింగ్‌ లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ సోమవారం నాడు ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో భట్టాచార్య ఈ ప్రకటన చేశారు.  డర్టీ డజన్‌ అకౌంట్లలో ఆరు ఎస్‌బీఐలో ఉండడం గమనార్హం. దివాలా ప్రక్రియకు ఆర్‌బీఐ రిఫర్‌ చేసిన 12 భారీ మొండిబకాయిల అకౌంట్లలో భూషన్‌ స్టీల్‌ (రూ.44,478 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,365 కోట్లు), ఎస్సార్‌ స్టీల్‌ (రూ.37,284 కోట్లు), భూషన్‌ పవర్‌ (రూ.37,248 కోట్లు), అలోక్‌ ఇండస్ట్రీస్‌ (రూ.22,075 కోట్లు) తదితర కంపెనీలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు