ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

29 Jul, 2019 17:50 IST|Sakshi

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల కోత

ఆగస్టు 1 నుంచి సవరించిన రేట్లు అమలు 

సాక్షి, ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ఇండియా (ఎస్‌బీఐ)  కస్టమర్లకు షాకిచ్చింది. వివిధ  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటును తగ్గించింది.  45  రోజుల -10 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను భారీగా కోత పెట్టింది.  ఈ సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

దాదాపు అన్ని కాలపరిమితి గత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రేటును తగ్గించింది. 2-3 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5 బేసిస్‌ పాయింట్ల మేర కోత పెట్టింది. 3-5 ఏళ్ల  డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్లను తగ్గింపు అనంతరం వడ్డీరేటు 6.60 శాతంగా ఉంది. 7 రోజుల నుండి 45 రోజుల డిపాజిట్లపై  75 బేసిస్ పాయింట్లు  కోత పెట్టింది.  46-179 రోజుల ఎఫ్‌డిలపై  వడ్డీ రేటు మే 6.25 శాతం నుండి 5.75 శాతానికి తగ్గించింది. 180-210 కాలపరిమితిగల డిపాజిట్లపై వడ్డీరేటు 6.25గా ఉంటుంది. 2 కోట్ల రూపాయలకు మించిన బల్క్‌ డిపాజిట్లపై కూడా   వడ్డీరేటును తగ్గించింది.

రానున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు  నెలలో చేపట్టనున్న పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీరేటు కోతకు కేంద్ర బ్యాంకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా తాజాగా ఇలాంటి సంకేతాలను అందించారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ మరో సారి వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని భావిస్తున్నానని ఆమె పేర్కొనడం  గమనార్హం.

మరిన్ని వార్తలు