ఎస్‌బీఐ రుణ రేట్లలో స్వల్ప కోత...

10 Apr, 2019 09:48 IST|Sakshi

ఎంసీఎల్‌ఆర్‌ 5 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై రేటు 0.10% కట్‌  

ముంబై: అన్ని కాలపరిమితులకు సంబంధించి రుణ రేటును కేవలం ఐదు బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ లెక్కన రేటు 0.05% తగ్గిందన్నమాట. ఏప్రిల్‌ 10 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ వారం 4వ తేదీన పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25%)ను తగ్గిస్తే, ఎస్‌బీఐ ఇందులో కేవలం 0.05 శాతాన్ని కస్టమర్లకు బదలాయిస్తుండటం గమనార్హం. తాజా రేట్ల స్థితిని పరిశీలిస్తే...

  • ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు) 8.55 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది.  
  • ఇక రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై వడ్డీరేటు 10 బేసిస్‌ పాయింట్లు (0.10 శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు శ్రేణి 8.70–9 శాతం నుంచి 8.60–8.90 శాతం శ్రేణికి దిగివచ్చింది.  

మూడవ బ్యాంక్‌...
ఆర్‌బీఐ రేటు కోత నిర్ణయం తరువాత ఈ దిశలో నిర్ణయాలు తీసుకున్న మూడవ బ్యాంక్‌ ఎస్‌బీఐ. ఇప్పటికే ఇండియన్‌ ఓవర్‌సీస్‌ (ఐఓబీ) బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం)లు ఏడాది ఆపైన కాలపరిమితి రుణ రేటును 0.05 శాతం తగ్గించాయి. ఐఓబీ రుణ రేటు 8.70 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గితే, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఈ రేటును 8.75 శాతంనుంచి 8.70 శాతానికి తగ్గించింది. ఈ రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయి. ఆర్‌బీఐ నుంచి పొందిన వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిం చడం లేదన్న విమర్శ పలు వర్గాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు