డిపాజిట్ రేట్లు డౌన్..

6 Dec, 2014 00:21 IST|Sakshi
డిపాజిట్ రేట్లు డౌన్..

ఎస్‌బీఐ పావు శాతం కోత
ఇప్పటికే తగ్గించిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు..
ఇతర బ్యాంకులదీ ఇదే బాట!

 
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్ రేటును పావు శాతం తగ్గించింది. దీనిప్రకారం ఏడాది పైబడి, ఐదేళ్ల లోపు డిపాజిట్లపై రేటును ప్రస్తుత 8.75 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించింది. కోటి రూపాయిల లోపు రిటైల్ డిపాజిట్లకు తాజా నిర్ణయం అమలవుతుంది. సోమవారం నుంచీ కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు రెండు- ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు డిపాజిట్ రేట్లు పావు శాతం నుంచి అరశాతం శ్రేణిలో తగ్గించిన నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా చర్య తీసుకుంది. ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ కూడా గురువారం ఆరు నెలల నుంచి 20 ఏళ్ల మధ్య డిపాజిట్లపై అరశాతం వరకూ వడ్డీరేటు కోత విధించింది.  గత కొద్ది నెలల్లో రెండు సార్లు ఏడాది కాలం లోపు స్వల్పకాలిక మెచ్యూరిటీల్లో ఎస్‌బీఐ  రేటు కోత నిర్ణయం తీసుకుంది.

రుణ రేట్ల తగ్గుదలకు సూచన!
డిపాజిట్ రేటు కోతను సాధారణంగా రుణ రేటు తగ్గుదలకు సంకేతంగా భావిస్తారు. వ్యవస్థలో రుణ వృద్ధి రేటు మందగమనం, బ్యాంకుల వద్ద తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ఉండడం, రానున్నది తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థన్న సంకేతాలు బ్యాంకుల డిపాజిట్ రేటు కోతకు నేపథ్యం. ‘ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే (ద్రవ్యలోటుకు అడ్డుకట్ట పడితే) వచ్చే ఏడాది ఆరంభంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటాం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రఘురామ్ రాజన్ డిసెంబర్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

మార్చి నాటికి రుణ రేటు కోత: హెచ్‌డీఎఫ్‌సీ
వచ్చే ఏడాది మార్చి నాటికి రుణ రేటును తగ్గిస్తామని దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి మాట్లాడుతూ, మార్చి నాటికి బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్ రేటు) ను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ బేస్ రేటు 10 శాతంగా ఉంది. డిపాజిట్ రేటు కోత నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతకు అందించడంపై బ్యాంక్ దృష్టి సారిస్తుందని ఆదిత్య పురి అన్నారు.
 
ఫిబ్రవరిలో రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా
ఇదిలాఉండగా, ఫిబ్రవరిలో జరగనున్న ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమీక్షలో  పావుశాతం రేట్ల కోత ఉండవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా-మిరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ- ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. 2015 సంవత్సరం మొత్తంలో ముప్పావుశాతం వడ్డీరేటు తగ్గే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరల తగ్గుదల భారత్ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశమని కూడా నివేదిక విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత దృష్ట్యా గడచిన ఐదు పాలసీ సమీక్షల్లో ఆర్‌బీఐ ఈ రేటును యథాతథంగా కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు