మోస్తరు రిస్క్‌... రాబడులు ఎక్కువ!

17 Jun, 2019 12:55 IST|Sakshi

ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌

కాస్త అధిక రాబడుల కోసం మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ కూడా ఒకటి. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. తద్వారా ఈక్విటీ పెట్టుబడులతో అధిక రాబడులు, డెట్‌ పెట్టుబడులతో రిస్క్‌ను తగ్గించే విధంగా ఈ పథకం పనితీరు ఉంటుంది. గతంలో ఈ పథకం ఎస్‌బీఐ మ్యాగ్నం బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ పేరుతో కొనసాగిందన్నది గుర్తుంచుకోవాలి.

రాబడులు
ఈ పథకం రాబడులు అన్ని సమయాల్లోనూ ఈక్విటీ హైబ్రిడ్‌ విభాగం సగటు రాబడుల కంటే అధికంగానే ఉన్నాయి. పదేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతం రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 16.7 శాతం కాగా, ఈక్విటీ హైబ్రిడ్‌ విభాగం సగటు రాబడులు 13.8 శాతంగానే ఉన్నాయి. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు 14 శాతం, మూడేళ్లలో 12.6 శాతం చొప్పున ఉండగా, ఈ విభాగం సగటు రాబడులు ఇదే కాలంలో 11.2 శాతం, 11.1 శాతం చొప్పున ఉన్నాయి. ఈక్విటీల్లోనూ రిస్క్‌ తక్కువగా ఉండేందుకు లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, రిస్క్‌ మధ్యస్థంగా ఉండాలని భావించే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.

పోర్ట్‌ఫోలియో
ఈక్విటీ, డెట్‌ కలబోత కనుక భిన్న మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియోను మార్చుకోవడం ఈ పథకం పనితీరులో భాగంగా గమనించొచ్చు. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం మేనేజర్లు ఈక్విటీల కేటాయింపులను కనిష్టంగా 64 శాతం, గరిష్టంగా 72 శాతం మధ్య నిర్వహించారు. అస్థిరతల సమయాల్లో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుని 10 శాతం వరకు నగదు నిల్వలను ఉంచుకునే వ్యూహాన్ని ఈ పథకం పాటిస్తుంది. 2017 మార్కెట్‌ ర్యాలీ సమయంలో ఈ పథకంలోని మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 72 శాతంగా ఉండగా, 2018 కరెక్షన్‌ సమయానికి 64 శాతానికి పరిమితం అయ్యాయి. దీంతో బెంచ్‌మార్క్‌ సూచీలతో పోలిస్తే ఈ పథకం నష్టాలను తగ్గించుకుంది. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మల్టీక్యాప్‌ విధానాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడుల్లో 72 శాతాన్ని లార్జ్‌క్యాప్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. మిగిలిన మొత్తం మిడ్, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించింది. అలాగే, పోర్ట్‌ఫోలియోలో 54 స్టాక్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఈక్విటీల్లో 72 శాతం, డెట్‌లో 24.58 శాతం పెట్టుబడులు ఉండగా, మిగిలిన మొత్తం నగదు రూపంలో ఉంచుకుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 31.58 శాతం ఫైనాన్షియల్, బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత సేవల రంగంలో 9 శాతం, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు ఒక్కోదానికీ 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది.

మరిన్ని వార్తలు