ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం కాదు: రజనీష్‌

8 Mar, 2020 04:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదని, కేవలం దాంట్లో వాటాను కొంటామని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్‌ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువుందన్నారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్‌ స్కీంపై తమ బ్యాంక్‌ న్యాయబృందం పనిచేస్తోందన్నారు.

ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ఎట్టిపరిస్థితుల్లో ఉండదని స్పష్టంచేశారు. ‘యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేస్తే రూ.2,400కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది. పెట్టుబడి పథకాన్ని చూశాక 23 మంది ఇన్వెస్టర్లు ఎస్‌బీఐని సంప్రదించారు’ అని చెప్పారు. ‘యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ 49 శాతం కొంటుందా? లేక  26 శాతం తీసుకుంటుందా? అనేది ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్ల నుండి వచ్చిన ఆసక్తిని పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు