రుణ మాఫీలతో మాపై మరింత ఒత్తిడి

4 Jul, 2014 00:49 IST|Sakshi
రుణ మాఫీలతో మాపై మరింత ఒత్తిడి

ముంబై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపాదిత వ్యవసాయ రుణ మాఫీలపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య మరోసారి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటి వల్ల  బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న తమ వ్యవసాయ రుణాల పోర్ట్‌ఫోలియోపై.. రుణ మాఫీ అంశం కారణంగా తొలి త్రైమాసికంలో మరింత ప్రతికూల ప్రభావం పడగలదని వ్యాఖ్యానించారు. ‘క్యూ1లో వ్యవసాయ రుణాల పోర్ట్‌ఫోలియోపై ఒత్తిడి పెరిగితే దానికి కచ్చితంగా రుణ మాఫీ(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో) అంశమే తప్ప వర్షాభావ పరిస్థితులు కారణం కాబోవు. ఎందుకంటే, వర్షాభావ ప్రభావం అంత త్వరగా కనిపించదు’ అని అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు.

గురువారం ఎస్‌బీఐ 59వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాలొన్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆమె ఈ విధంగా స్పందించారు. రుణ మాఫీ అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు సృష్టిస్తోందని, ఇప్పటికే రైతులు బకాయిలు కట్టడం ఆపేశారని అరుంధతి తెలిపారు.

 మరోవైపు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో నిరర్ధక ఆస్తుల సమస్య కొంత తగ్గుముఖం పట్టగలదని అరుంధతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది(2014-15) రుణాల మంజూరీలో 15-16% మేర వృద్ధి నమోదు చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతానికైతే బ్యాంకు వద్ద తగినంత మూలధనం ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు