లాభసాటి పెట్టుబడులు!

25 Feb, 2019 00:51 IST|Sakshi

ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ 

ఈక్విటీ పెట్టుబడులపై తగినంత రాబడులు కోరుకునే వారికి ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ మంచి ఎంపికే అవుతుంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రాబడులు ఇచ్చే విధానంలో ఈ పథకం పనిచేస్తుంటుంది. కనుక ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్‌ అవుతుంది. ఈ పథకానికి ఆర్‌ శ్రీనివాసన్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
పెట్టుబడుల విధానం 
ఫోకస్డ్‌ ఈక్విటీ పథకాల్లో ముందు నుంచి ఉన్న పథకాల్లో ఇదీ ఒకటి. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్‌ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్‌ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 24 స్టాక్స్‌ ఉన్నాయి. 10 స్టాక్స్‌లోనే 51 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. ఇందులోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పీఅండ్‌జీ హైజీన్, ఎస్‌బీఐ, కోటక్‌ బ్యాంకు, దివిస్‌ ల్యాబ్స్‌లో అత్యధికంగా (33శాతం) ఇన్వెస్ట్‌ చేసి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో 35 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఎఫ్‌ఎంసీజీ, ఇంజనీరింగ్‌ రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసింది. సర్వీసెస్, కెమికల్స్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఎనర్జీ రంగాల్లోనూ పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది. లార్జ్‌క్యాప్‌లో 59 శాతం, మిడ్‌క్యాప్‌లో 22 శాతం, స్మాల్‌క్యాప్‌లో 19 శాతం కేటాయింపులు ఉన్నాయి. తన పోర్ట్‌ఫోలియోలో ఓ విదేశీ స్టాక్‌ను కూడా యాడ్‌ చేసుకుంది. గూగుల్‌ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ క్లాస్‌ఏ షేర్లలో 3.39 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈ తరహా స్టాక్స్‌ ఎంపిక కారణంగా ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల ట్రాక్‌ ఉంది. గతంలో ఎస్‌బీఐ ఎమర్జింగ్‌ ఫండ్‌తో నడిచిన ఈ పథకం పేరు ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌గా గతేడాది మారింది. 

రాబడులు  
ముఖ్యంగా దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఐదేళ్లు, పదేళ్ల కాలంలో బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే అధిక రాబడులతో ముందుంది. ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 18.66 శాతం, పదేళ్లలో వార్షిక సగటు రాబడులు 25.71 శాతం చొప్పున ఉన్నాయి. ఇదే కాలంలో బీఎస్‌ఐ 500 టీఆర్‌ఐ రాబడులు 14.74 శాతం, 17.48 శాతం చొప్పున ఉన్నాయి. ఇక ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు మైనస్‌ 2.20 శాతం కాగా, బీఎస్‌ఈ 500 రాబడులు మైనస్‌ 1.06 శాతం (నష్టాలు)గా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ 14.78 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. ఈ కాలంలో బీఎస్‌ఈ 500 సూచీ మొత్తం రాబడులు వార్షికంగా 15.54 శాతంగా ఉన్నాయి. ఏడాది, మూడేళ్ల కాలంలో స్వల్పంగా రాబడుల్లో వెనుకబడి ఉన్నప్పటికీ... దీర్ఘకాలంలో మాత్రం అధిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు